జ‌గ‌న‌న్న విద్యాదీవెన నిధులు విడుద‌ల.. ఒక్క బటన్ క్లిక్ తో రూ.709 కోట్లు

CM Jagan speech in Jagananna Vidya Deevena scheme in Tirupati.చదువు అనేది మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 9:13 AM GMT
జ‌గ‌న‌న్న విద్యాదీవెన నిధులు విడుద‌ల.. ఒక్క బటన్ క్లిక్ తో రూ.709 కోట్లు

చదువు అనేది మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్య‌మంత్రి జగన్‌ అన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటిలోని తార‌క రామ స్టేడియంలో విద్యా దీవెన చివ‌రి త్రైమాసికానికి సంబంధించిన న‌గ‌దు జ‌మ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్క బటన్ నొక్కి జమ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చదువు అనేది పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని అన్నారు. మ‌న త‌ల‌రాల‌ను మార్చే శ‌క్తి చ‌దువుల‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు.

విద్యార్థులు ఫీజులు క‌ట్ట‌లేక చ‌దువును మ‌ధ్య‌లోనే ఆప‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో జ‌గ‌నన్న విద్యాదీవెన అమ‌లు చేస్తున్నామ‌న్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,994 కోట్లు ఖర్చు చేసిద‌ని, 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ అన్నారు. పిల్లలను చదివించుకోలేని, ఫీజులు కట్టకోలేకపోతున్న తల్లిదండ్రుల క్షోభను తాను కళ్లారా చూశానని, ఫీజులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలైన ఘటనలు చూశానని, ఇలాంటి కష్టాలు చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశానన్నారు.

ఇలాంటివి పునరావృతం కాకూడదని వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్‌ వరుసగా మూడేళ్లపాటు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. అవినీతికి తావులేని రీతిలో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతోనూ, వారి తల్లిదండ్రులతోనూ సంభాషించారు.గ త ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చిందన్నారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఏంటో మీరే గమనించడని తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్‌ కోరారు.

Next Story