Tirumala: నడక దారిలో చిరుత సంచారం.. శ్రీవారి భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తున్నట్టు భక్తులు గుర్తించారు.

By అంజి  Published on  14 Nov 2023 8:15 AM GMT
Cheetah,  Tirumala, Srivari Mettu, Devotees, TTD

Tirumala: నడక దారిలో చిరుత సంచారం.. శ్రీవారి భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తున్నట్టు భక్తులు గుర్తించారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుత పులిని చూసినట్టు పులివెందులకు చెందిన కొంత మంది భక్తులు చెప్పారు. దీనిపై వారు టీటీడీ అధికారులకు కూడా సమాచారం అందించారు. దీంతో కాలినడకన వెళ్లే భక్తులను టీటీడీ అధికారులు గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ దగ్గర భద్రతా సిబ్బంది భక్తులను నిలిపి గుంపులు.. గుంపులుగా పంపుతున్నారు. చిరుత సంచారంతో శ్రీ వారి భక్తులు భయాందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల కిందట చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో వాటిని ఫారెస్ట్‌ అధికారులు బంధించి వేరో చోట విడిచిపెట్టారు. ఇప్పుడు మరో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి దేవికి మంగళవారం రాత్రి జరిగే మహోన్నత గజవాహనంలో శ్రీవారి లక్ష్మీ కాసులహారాన్ని నవంబర్ 14న తిరుమల నుంచి తిరుచానూరు వరకు టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత విలువైన, ముఖ్యమైన ఆభరణాలలో లక్ష్మీ కాసుల హారం ఒకటి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం తిరుమల నుంచి తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయానికి ఉత్సవ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు సాయంత్రం గజవాహన సేవలో పద్మావతి అమ్మవారి అలంకారానికి శ్రీవారి లక్ష్మీ కాసుల హారం తీసుకురావడం ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం.

Next Story