కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు భూరీ విరాళాన్ని అందించాడు. వేంకటేశ్వరుడికి బంగారు కఠి, వరద హస్తాలను విరాళంగా ఇచ్చాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం వీఐపీ విరామ సమయంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి వీటిని అందించారు. ఆలయంలోని మూల విరాట్‌కు అలంకరించేలా ఈ ఆభరణాలను ఎంతో భక్తి శ్రద్దలతో తయారు చేయించినట్లు వెల్లడించాడు.
దాదాపు ఆరు కిలోల బరువు గల వీటి విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అంచనా వేస్తోంది. వాటిని ఈ రోజు అభిషేక సేవ అనంతరం స్వామి వారికి అర్చకులు అలంకరించారు. భక్తితో చేసిన విరాళమని, ప్రచారం అవసరం లేదంటూ దాత కోరడంతో అతడి సమాచారాన్ని టీటీడీ గోప్యంగా ఉంచింది.
ఇదలాఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 30,668 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.31 కోట్లు వచ్చింది. 14,570 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.