శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు కాలినడకన చేరుకోవడానికి భక్తులు వినియోగించే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలల పాటు మూతపడనుంది. సెప్టెంబరు మాసం లోపుగా మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫలితంగా.. కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు సెప్టెంబరు వరకు శ్రీవారిమెట్టు నడక మార్గం ద్వారానే చేరుకునేందుకు భక్తులను అనుమతినిచ్చింది టీటీడీ.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలను సందర్శించే శ్రీవారి భక్తుల సంఖ్య నామమాత్రంగా ఉండడం వల్ల అలిపిరి-తిరుమల నడకమార్గం అభివృద్ది పనులను తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. దీంతో జూన్ 1 నుంచి జులై 31 వరకు ఈ మార్గాన్ని మూసివేశారు. ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించారు. సెప్టెంబరు నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకల్ని అనుమతించడం లేదని తెలిపింది. ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించు కోవాలని టీటీడీ సూచించింది.
అక్టోబరులో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉన్నందున.. ఈ లోగా అలిపిరి-తిరుమల మెట్ల మార్గం అభివృద్ది పనులను పూర్తి చేయాలని టీటీడీ అధికారులు బావిస్తున్నారు.