తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు
A Water tank comes out from the ground in Tirupati.ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్రిక కేంద్రం తిరుపతిలో ఓ వింత ఘటన చోటు
By తోట వంశీ కుమార్ Published on 26 Nov 2021 12:42 PM ISTప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నీటి కోసం భూమిలోపల సిమెంట్ రింగులతో ఏర్పాటు చేసిన ట్యాంకు బయటకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రింగులు భూమిపైకి వచ్చాయి. ఈ ఘటన తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎంఆర్‌పల్లిలోని శ్రీకృష్ణానగర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఇంటి పరిసరాల్లో నీటి కోసం భూమిలోపల పదేళ్ల క్రితం 25 రింగులతో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. కాగా.. ఇటీవల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ట్యాంకును శుభ్రం చేసేందుకు ఓ మహిళ అందులోకి దిగింది. నీటిని తొలగించగా.. ఒక్కసారిగా ఉన్నట్లుండి ఆ ట్యాంకు దానికదే కదిలింది. భూమిలోంచి క్రమంగా పైకి రావడం మొదలైంది. భయపడిన మహిళ ట్యాంకుపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో మహిళకు స్వల్పగాయాలయ్యాయి. భూమిపైకి రింగులు రావడం చూసిన స్థానికులు భయపడ్డారు. ఇక ఈ వింత చూడడానికి జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.
ఈ వింత గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి ట్యాంకు ను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగానే ట్యాంకు పైకి వచ్చిందని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కాగా.. దీనిపై అధికారులు స్పందించారు. భారీ వర్షాల కారణంగా భూమి లోపలి పోరల్లో వరద నీటి ప్రవాహానికి వాటర్ ట్యాంకు బయటకు వచ్చినట్లు వారు చెప్పారు. ఇలాంటివి జరగడం సహజమేనని అన్నారు.