తిరుమల మలయప్ప విగ్రహానికి పగుళ్లు?
By Newsmeter.Network Published on 29 Nov 2019 12:01 PM IST![తిరుమల మలయప్ప విగ్రహానికి పగుళ్లు? తిరుమల మలయప్ప విగ్రహానికి పగుళ్లు?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/11/Tirumala-1.jpg)
కోట్లాది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తిరుమల తిరుపతి మలయప్పస్వామి విగ్రహానికి పగుళ్లు కానవస్తున్నాయి. ఏళ్ల తరబడి స్నపన తిరుమంజనాలు, విశేష పూజలు, ఆర్జిత సేవలు చేస్తూ వస్తూన్న కారణంగా, విగ్రహంలో అరుగుదల కనిపిస్తోంది. దీని ఫలితంగా కొన్ని చోట్ల విగ్రహానికి పగుళ్లు వచ్చాయి.
మలయప్ప స్వామి శ్రీవారి ఉత్సవ విగ్రహం. స్వామి వారిపూజలు, ఉరేగింపులలో ఈ విగ్రహాన్నే ఉపయోగిస్తారు. ఇది పురాతనమైనదే కాదు, చారిత్రికమైనది కూడా. ఈ పగుళ్ల కారణంగా ఇకపై శ్రీవారికి కొన్ని రకాల ఆర్జిత సేవలు నిర్వహించరాదని ఆగమ సలహా సమితి సూచించింది. ఈ కారణంగా ప్రతి సోమవారం జరిగే విశేష పూజ, ప్రతి బుధవారం జరిగే సహస్ర కలశాభిషేకం, నిత్య వసంతోత్సవ పూజలను నిలిపి వేయాలని సూచించింది. ఈ సలహాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డిసెంబర్ లో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
గతంలోని మలయప్ప ఉత్పవ మూర్తి ముఖం, కళ్లు, చేతి వేళ్లు, నడుము వంటి ప్రాంతాల్లో అరిగిపోయి స్పష్టంగా కనిపించని పరిస్థితి వచ్చింది. అప్పుడు విగ్రహానికి కొద్దిగా మెరుగులు దిద్ది, ఇవి స్పష్టంగా కనిపించేలా చేయడం జరిగింది. అయితే ఈ సారి పగుళ్లు కనిపించడంలో తితిదే ఒక్కసారిగా అప్రమత్తమైంది.