80 మంది టీటీడీ సిబ్బందికి కరోనా వైరస్
By సుభాష్ Published on 9 July 2020 7:39 AM IST
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళనకరంగా మారుతోంది. అయితే అన్‌లాక్‌లో 1 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్వామి వారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. తిరుమల తిరుపతి దేశస్థానంలో ఇప్పటి వరకు 80 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా తెలిపారు.
ప్రతి రోజు 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 80 మందికి పాజిటివ్‌తేలినట్లు ఆయన తెలిపారు. అయితే భక్తుల ద్వారానే టీటీడీ ఉద్యోగులకు సోకినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
కాగా, చిత్తూరు జిల్లాలో 1,765 కరోనా కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి 22,259 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 11,101 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 264 మంది మరణించారు.