గూగుల్ మామ, వాట్సప్ వదిన.. ఒక మందు బాబు మరిది.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Dec 2019 5:16 AM GMT
గూగుల్ మామ, వాట్సప్ వదిన.. ఒక మందు బాబు మరిది.!

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్న సామెత మందు బాబులకు భలేగా వర్తిస్తుంది. శనివారం వస్తే చాలు భాగ్యనగర పోలీసులు ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్నా పెద్దా, ఆడా మగా ఈ పరీక్షల్లో పట్టుబడిపోతున్నారు. దొరికితే ఫైన్.. వాహనం స్వాధీనం.. ఆ తరువాత కౌన్సెలింగ్ క్లాసులు.. అదీ చాలదన్నట్టు నడిరోడ్లో నిలబడి “మద్యం తాగి బండి నడపకండి అంటూ ప్లకార్టు పట్టుకోవడం.. ఇదంతా పెద్ద తలనొప్పి గా మారి కూర్చుంది. దీంతో మందుభాయిలు మందుతాగడం మానేస్తారని ఆనుకుంటాన్నారా? ఆ పప్పులేం ఉడకవు. వారు ప్రభుత్వానికి ఎలాగైనా మందు తాగి “పన్ను చెల్లించితీరతాం” అంటున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే కొత్త ఎత్తులు కనుగొంటున్నారు.

ఇప్పుడు మందుబాబులకు గూగుల్ మ్యాప్స్ మంచి దోస్తుగా మారింది. అది ఎక్కడ పోలీసులు మాటు వేసి ఉన్నారో చెప్పేస్తోంది. దాంతో మన బుడ్డీ బాబులు పోలీసులు ఉన్న రోడ్లలోకి వెళ్లకుండా వేరే రూట్లు ఎంచుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్ లో “పోలీసులున్నారు జాగ్రత్త” అన్న అలర్ట్ లు రావు కానీ, ఆ రోడ్లో ట్రాఫిక్ ఎలా ఉందో చెబుతుంది. ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ డైరక్షన్లు ఇచ్చేటప్పుడు గ్రీన్ లైన్ ఉందనుకొండి. అక్కడ ట్రాఫిక్ సజావుగా ఉన్నట్టు. ఆరెంజ్ రంగు ఉంటే ట్రాపిక్ నెమ్మదిగా కదులుతున్నట్టు. మెరూన్ రంగులో గీత ఉంటే అక్కడ ట్రాపిక్ జామ్ ఉన్నట్టు. కాబట్టి మన వాళ్లు రెండు మూడు పెగ్గులేసిన తరువాత గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఆరెంజ్ లేదా మెరూన్ రంగు కనిపిస్తే ఆ రోడ్డును వదిలేసి ఇంకో రోడ్డును వెతుక్కుంటున్నారట. ఇది కాస్త టైం ఎక్కువగా పట్టినా, పోలీసు మామ కంట పడకుండా మన మందు మచ్చాలు తప్పించుకోవచ్చు.

ఒక్క గూగుల్ మావయ్యే కాదు వాట్సప్ వదిన కూడా మందు మరుదులకు సాయం చేస్తుందండోయ్. మందుభాయిలు ఒకరికొకరు వాట్సప్ ద్వారా హెచ్చరికలు చేసేసుకుంటున్నారట. దీంతో జాగ్రత్త పడి ఎక్కడి మందుభాయిలు అక్కడే గప్ చుప్ అయిపోతున్నారట.

శనివారం సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ నిఘా మొత్తం మీద ఫలితాలను ఇస్తోంది. పెద్ద పెద్ద సెలబ్రటీలు కూడా దొరికిపోతున్నారు. దీంతో ఎవరికి వారు ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడిపోతున్నారు.

Next Story