ట్రంప్‌పై ఎదురు దాడి.. కోర్టును ఆశ్రయించిన 'టిక్‌టాక్'
By సుభాష్ Published on 25 Aug 2020 9:24 AM GMTఅమెరికాలో ట్రంప్ ప్రభుత్వం టిక్‌టాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషేధం విధించడంపై టిక్‌టాక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఈ సంస్థ దేశంలో కార్యకలాలను మూసివేయాలన్న ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ, కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో టిక్‌టాక్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనను వినేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో, న్యాయస్థానంలో సవాలు చేయడం జరిగిందని టిక్‌టాక్ సంస్థ ప్రకటించింది.
అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని టిక్‌టాక్ తన ఫిర్యాదులో ఆరోపించింది. ట్రంప్ జారీచేసిన ఈ ఉత్తర్వు రాజకీయాలతో కూడుకున్నదని ఆరోపిణలు గుప్పించింది. యాప్‌ను నిషేధించేందుకు ట్రంప్ సర్కార్ అనుసరించిన విధానం, నిష్పక్షపాతంగా లేదని తెలిపింది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్, కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్, ఆ దేశ వాణిజ్య శాఖలపై కూడా ఫిర్యాదు చేసింది. అమెరికా, సింగపూర్‌లలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఉంటుందని టిక్‌టాక్ వెల్లడించింది. కాగా, అమెరికాలో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తదితర సంస్థలతో పాటు రిలయన్స్ కూడా చర్చలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.