కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
By అంజి
జమ్ముకశ్మీర్‌లో భీకర కాల్పులు జరిగాయి. పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణన కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా దైవర్ గ్రామంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పులకు భదత్రా బలగాలు దీటుగా సమాధానం ఇచ్చాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి.
త్రాల్ సెక్టార్‌లోని దైవర్ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భదత్రా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు.. ఎదురుతిరిగి కాల్పులు చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలను నిర్వహించారు. అప్రమత్తమైన బలగాలు.. ఉగ్రవాదలుపై కాల్పులు చేశాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకేవరైనా ఉగ్రవాదులు దాక్కున్నారేమోనన్న అనుమానంతో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఐజీ విజయ్ కుమార్ మట్లాడారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదలు వివరాలను సేకరిస్తున్నామన్నారు.
ఈ నెల 5న శ్రీనగర్ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. ఓ సైనికుడు ప్రాణాలు వదిలాడు.