జమ్మూ:  హిజ్బుల్ కమాండర్ మసూద్ అహ్మద్‌ను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

By సుభాష్  Published on  29 Jun 2020 8:34 AM GMT
జమ్మూ:  హిజ్బుల్ కమాండర్ మసూద్ అహ్మద్‌ను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

జమ్మూకశ్మీర్‌లో కాల్పుల మోత మోగుతోంది. జమ్మూలోని ఖుల్‌ చోహార్‌ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో హిజ్బుల్‌ కమాండర్‌ మసూద్‌ అహ్మద్‌భట్‌ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ మసూద్‌ మృతితో జమ్మూ ప్రాంతంలోని ధోడా జిల్లా అంతా ఉగ్రవాదుల నుంచి విముక్తి పొందినట్లయిందని పోలీసులు వెల్లడించారు. ఇక్కడ ఉగ్రవాదుల్లో బతికిన్నది అతడే చివరి వాడని తెలిపారు. జమ్మూపోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఘటన స్థలంలో ఏకే-47, రెండు పిస్టళ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మసూద్‌పై ధోడా పోలీస్‌ స్టేషన్‌లో ఓ రేప్‌ కేసు కూడా ఉందని, అప్పటి నుంచి పరారీలో ఉన్న మసూద్ అహ్మద్‌ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లో సుమారు 29 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారిని కూడా మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా దళాలు తెలిపాయి. ఉగ్రవాదులకు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదని, ప్రతి రోజు ముగ్గురు, నలుగురు చొప్పున మట్టుబెడుతున్నామని, అయినా ఇంకా రెచ్చిపోతున్నారని అన్నారు. వారి అగడాలను రోజు రోజుకు అంతం చేసే దిశగా ఆపరేషన్‌ చేపడుతున్నామన్నారు.

Next Story
Share it