పసికందు సహా ముగ్గురికి కరోనా పాజిటివ్
By రాణి Published on 7 April 2020 6:15 PM IST
- మహబూబ్ నగర్ జిల్లాలో అప్రమైన అధికారులు
- బాధితులు గాంధీ ఆస్పత్రికి తరలింపు
కరోనా వైరస్ పలానా వయసు వారికే వస్తుందన్న నియమమేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్యులు చెప్తున్న మాటలు నిజమవుతున్నాయి. రోజుల పసికందుల నుంచి వయసుమళ్లిన వృద్ధుల వరకూ ఎవరినీ విడిచి పెట్టట్లేదు. అయితే తెలంగాణలో కాంటాక్ట్ కేసులు ఎక్కువవుతున్నాయి. అధికంగా ఢిల్లీ లింక్ కేసులున్నాయి. వారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకుతోంది. ఇప్పుడిప్పుడే ఢిల్లీ మర్కజ్ లింక్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మహబాబ్ నగర్ జిల్లాలో ఓ పసికందుకు కూడా కరోనా సోకిందన్న వార్త వైరల్ అవుతోంది. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read : టిక్ టాక్ పై ఫైర్ అవుతోన్న యూజర్లు
ఇటీవల మర్కజ్ కు వెళ్లొచ్చిన వారి ద్వారా పసికందు తండ్రికి కరోనా వైరస్ సోకింది. అతడి నుంచి నాయనమ్మకు..ఆమె నుంచి 23 రోజుల పసికందుకు కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ముగ్గురినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా..జిల్లాలో ఒక్కరోజే మూడు కరోనా కేసులు నమోదవ్వడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా బాధితుల ఇంటి చుట్టుపక్క 3 కిలోమీటర్ల వరకూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు. బాధితుల ఇంటి పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో వీరి ద్వారా ఎంతమందికి వైరస్ సోకి ఉంటుందోనని నిఘా పెట్టారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే సంకోచించకుండా వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : లాక్‌డౌన్: మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.!