తీవ్ర విషాదం.. చెరువులో కారు పడి ముగ్గురు మృతి
By అంజి Published on 22 Feb 2020 2:14 PM IST
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లంకి చెరువులో కారుపడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు సర్నెనిగూడెం సర్పంచ్ రాణి భర్త మధు, కొడుకు మత్స్యగిరి, కారు డ్రైవర్ సాగుబావిగూడెంనకు చెందిన శ్రీధర్‌రెడ్డిగా గుర్తించారు. జేసీబీ సాయంతో చెరువులోంచి కారును స్థానికులు బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో సర్నెనిగూడంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం నాడు సమీప గ్రామానికి పని నిమిత్తం వెళ్లిన వారు.. తిరిగి వస్తుండగా రాత్రి సమయంలో ఎల్లంకి చెరువుపై కారు ప్రమాదానికి గురైంది. కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు కారులోనే ఇరుక్కుపోయారు.
వారు ఎంతకు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు ఎల్లంకి గ్రామంలోని సీసీకెమెరాలను పరిశీలించారు. కారు ఎల్లంకి చెరువు కట్టపైకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ మధ్యాహ్నం ఎల్లంకి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో నుంచి కారుతో సహా మూడు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.