ఏపీలో మూడుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

By Newsmeter.Network  Published on  20 March 2020 5:19 AM GMT
ఏపీలో మూడుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. పలువురిని పరీక్షల నిమిత్తం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచారు. ఇదిలా ఉంటే ఏపీలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏపీలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ అండ్‌ ఫ్యామిలి వెల్పేర్‌ డైరెక్టర్‌ పేరుతో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు 966 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, వారిలో 258 మంది అబ్జర్వేషన్‌ పూర్తి చేసుకున్నారని తెలిపారు. 677 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, మొత్తం 31 మంది ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు199 కేసుల్లో శాంపిళ్లను టెస్ట్ చేశామని, వీటిలో మొత్తం మూడు శాంపిళ్లు పాజిటివ్‌ గా నమోదయ్యాయని తెలిపారు. అదేవిధంగా 104 శాంపిళ్లు నెగిటివ్‌గా నమోదయ్యాయని, అలాగే 12 కేసుల్లో శాంపిల్స్‌ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Also Read : తెలంగాణలో 16కు చేరిన కరోనా కేసులు

ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం వరకు రెండు కేసులు నమోదు కాగా. రాత్రి సమయంలో మూడో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. విశాఖపట్టణంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో విశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిన వ్యక్తి నివాసముండే ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లతో 114 బృందాలు ఏర్పాటు చేసినట్లు విశాఖపట్టణం డీఎంహెచ్‌వో తిరుపతిరావు తెలిపారు. మొత్తం 7,800 గృహాలను జల్లెడపడుతున్నట్లు చెప్పారు. స్ప్రెయింగ్‌ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామని వెల్లడించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో కోరారు.

Health Bulletin

వైరస్‌ సోకిన వృద్ధుడు మక్కా వెళ్లి వారం క్రితమే తన నివాసానికి తిరిగివచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కి పంపించారు. గురువారం అక్కడి నుంచి నివేదిక రాగా.. వృద్ధుడికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించడంతో పాటు అతని నివాసం ఉన్న ప్రాంతాల్లో వైద్య బృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈవారం రోజులపాటు ఎవరెవరిని కలిశాడు. ఎక్కడికి వెళ్లాడు తదితర విషయాలపై ఆరాతీస్తున్నారు.

Next Story