తెలంగాణలో 16కు చేరిన కరోనా కేసులు

By Newsmeter.Network  Published on  20 March 2020 3:34 AM GMT
తెలంగాణలో 16కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించినా ఈ వైరస్‌ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టలేక పోతుంది. గురువారం మధ్యాహ్నం వరకు 13కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అర్థరాత్రి వరకు మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కూడా ధ్రువీకరించింది. లండన్‌ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డికి చెందిన యువకుడు లండన్‌ నుంచి దుబాయి మీదుగా 18న హైదరాబాద్‌ వచ్చాడు. ఈనెల 10 నుంచే ఆ యువకుడిలో కొన్ని లక్షణాలుండటంతో.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

అదేవిధంగా నల్గొండకు చెందిన మరో యువకుడు లండన్‌ నుంచే బుధవారం వచ్చాడు. ఆయనలోనూ అప్పటికే వ్యాధి లక్షణాలు కనిపించడంతో నేరుగా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరిలోనూ గురువారం కరోనా నిర్దారణ అయింది. వీరిద్దరూ నేరుగా విమానాశ్రం నుంచి ఆస్పత్రికే వెళ్లడంతో.. కుటుంబ సభ్యులను గానీ, ఇతరులను గానీ కలిసే అవకాశం లేదని వైద్య వర్గాలు తెలిపాయి. విమానాశ్రయంలోనే గుర్తించి విడిగా ఉంచడం వల్ల వైరస్‌ వ్యాప్తి కాకుండా అడ్డుకున్నట్లు అయిందని పేర్కొన్నారు. ఆ విమానాల్లోని ఇతర ప్రయాణికుల సమాచారాన్ని వైద్య శాఖ సేకరిస్తోంది. అంతకు ముందు దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారించారు. సదరు వ్యక్తి ఈ నెల 11న పంజాగుట్టలోని గ్యాలరియా మాల్‌ను సందర్శించినట్లు విచారణలో తెలిసింది. దీంతో ఆరోజు మాల్‌కు వెళ్లిన వారు స్వీయ నిర్బందంలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే మొన్నటి వరకు తెలంగాణలో కేవలం ఐదు పాజిటివ్‌ కేసులే నమోదు కాగా.. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఓ బృందంలో ఏడుగురికి కరోనా వైరస్‌ సోకడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. వైద్యులు వారిని ఐసోలేషన్‌ రూంలలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయిన వారు ఎక్కడెక్కడ తిరిగారు. అనే విషయాలపై దృష్టిసారించిన పోలీసులు.. కరీనగర్‌ పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. కరోనా వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నారు.

Next Story