కరోనా మహమ్మారి ప్రబలడాన్ని చూసి.. ఆత్మహత్య చేసుకున్న ఫైనాన్స్ మినిస్టర్..!
By న్యూస్‌మీటర్ తెలుగు
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. పలు దేశాల రాజకీయనాయకులు కరోనాను కట్టడి చేయాలని భావించారు. కానీ వీలు కాలేదు. ముఖ్యంగా జర్మనీ లాంటి దేశాల్లో కరోనా విపరీతంగా ప్రబలుతోంది. కరోనా ప్రభావాన్ని చూసి విపరీతంగా బాధపడిపోయిన జర్మనీ ఫైనాన్స్ మినిస్టర్ థామస్ స్కీఫర్ చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలవరపెడుతోంది.
కరోనా వైరస్ విపరీతంగా ప్రబలడాన్ని చూసిన థామస్ గత కొద్దిరోజులుగా ఎంతగానో బాధపడ్డాడు. ఇక కట్టడి చేయలేమని భావించాడో ఏమో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆ దేశ అధికారులు తెలిపారు.
శనివారం నాడు 54 సంవత్సరాల థామస్ వీస్బడెన్ లోని రైల్వే ట్రాక్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడి అధికారులు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.
జర్మనీ ఫైనాన్సియల్ క్యాపిటల్ అయిన ఫ్రాంక్ ఫర్ట్ హెస్సే రాష్ట్రంలోనే ఉంది. డ్యూట్షె బ్యాంకు, కామర్జ్ బ్యాంకులకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా అక్కడే ఉంది. హెస్సే ఫైనాన్స్ చీఫ్ గా ఆయన గత 10 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇటీవల కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న సమయంలో అక్కడి కంపెనీలకు, ఉద్యోగుల కోసం ఆయన 24 గంటలూ కష్టపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. కానీ ఆయనలో ఎక్కడో ఓ మూలన వైరస్ విపరీతంగా ప్రబలుతుందేమోనన్న భయం కూడా ఉండేది.. అదే ఆయన్ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఆయన లేని లోటు తీరనిది.. ఆత్మహత్య చేసుకుని తమందరినీ ఒంటరిగా చేసేసి వెళ్లాడని కుటుంబసభ్యులు బాధను వ్యక్తపరిచారు. ఆయన మృతికి పలువురు నాయకులు నివాళులు అర్పించారు.