భారత్‌లో మూడో కరోనా కేసు
By అంజి
తిరువంతపురం: ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్.. ఇప్పుడు క్రమక్రమంగా భారత్‌లోనూ వ్యాపిస్తోంది. కేరళలో మూడో వ్యక్తికి ఈ కరోనా వైరసన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. కాసర్‌గోడ్‌లోని ఓ వ్యక్తి ఈ వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. వైరస్ సోకిన బాధితుడు ఇటీవలే చైనా నుంచి కేరళకు వచ్చాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గత వారం కరోనా వైరస్ మొదటి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి ఈ కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థికి ఈ వైరల్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్థి కేరళలోని ఓ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, విద్యార్థి చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. ఇక ఆదివారం నాడు అలప్పుజలో రెండో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. అయితే వీరంతా ఇటీవలే చైనా నుంచి భారత్ చేరుకున్నారని అధికారులు తెలిపారు. కేరళలో కరోనా వైరస్ మెల్ల మెల్లగా వ్యాప్తి చెందుతుండడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు. కేరళ వ్యాప్తంగా 100 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు.
గత రెండు రోజుల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనాలోని వుహాన్ నుండి భారత్ కు రప్పించారు. తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు తమకు కూడా ఈ సమాచారం అందిందని.. కానీ అధికారికంగా ధృవీకరించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫీవర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.