వారిని కఠినంగా శిక్షించాలి.. రజనీకాంత్
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 12:40 PM GMT
తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా కొందరు పోలీసుల వ్యవహారశైలి తనను షాక్‌కు గురిచేసిందని రజనీకాంత్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పు చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని రజనీకాంత్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను వేధించి కిరాతంగా హత్య చేయడాన్ని మానవ సమాజమంతా వ్యతిరేకిస్తుంది.
తూత్తుకుడికి చెందిన పి.జయరాజ్, ఆయన కొడుకు బెనిక్స్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ షాపుని తెరిచారని పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా.. పోలీస్ కట్టడిలో ఉన్న ఆ ఇద్దరు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చనిపోయిన ఘటన పట్ల మంగళవారం మద్రాస్ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ స్వీకరించే వరకు.. సీఐడికి అప్పగించాలని పేర్కొంది. ఆ తండ్రి కొడుకులకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు పిలుపునిచ్చారు. దీనిపై రజనీకాంత్ స్పందించారు.
జయరాజ్, బెనిక్స్‌ను దారుణంగా హింసించి చంపడాన్ని అందరూ ఖండిస్తున్న సమయంలో మేజిస్ట్రేట్‌ను భయపెట్టడానికి ప్రయత్నించిన కొందరు పోలీసుల ప్రవర్తన చూసి షాక్‌కు గురయ్యాను. ఆ దారుణ చర్యను అందరూ ఖండించిన తరువాత వారు ఈ విధంగా స్పందించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు శిక్ష తప్పదు అని ట్విట్ చేశారు.