వారి ఆత్మహత్యలు తగ్గిపోవడానికి కారణం డాగ్ థెరపీనే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 8:51 PM IST
వారి ఆత్మహత్యలు తగ్గిపోవడానికి కారణం డాగ్ థెరపీనే..!

మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా.. కుక్కను పెంచుకుంటే వచ్చే ఆనందమే వేరు అని అంటూ ఉంటారు. ఎందుకంటే కుక్కలు మనిషిలో ఉన్న ఎలాంటి మూడ్ నైనా మార్చివేస్తాయి. మనం వాటి వైపు కోపంగా చూసినా.. అవి మాత్రం వచ్చి మన ఒళ్ళో కూర్చుంటాయి. ఎందుకంటే మనిషి ఎక్కువగా ప్రేమించే ఇష్టమైన జీవి కుక్క మాత్రమే..! కొన్ని చోట్ల కుక్కలను థెరపీ కోసం ఉపయోగిస్తున్నారంటే అవి మనిషి మనసుకు ఎలాంటి హాయిని కలిగిస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం అలాంటి కుక్క గురించే తెలుసుకుందాం.

రికీ.. ఒక గోల్డెన్ రిట్రీవర్ కుక్క.. ఉక్రెయిన్ దేశంలోని కీవ్ ప్రాంతంలో ఉంటుంది. రికీ ప్రత్యేకత ఏమిటంటే థెరపీ కుక్కలాగా సేవలను అందిస్తోంది. రికీ 'వసిల్' తొడపై తల పెట్టింది.. అయినప్పటికీ వార్ వెటరన్ అయిన అతడి ముఖంలో ఇంకా టెన్షన్ కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత అతడికి షేక్ హ్యాన్డ్ ఇచ్చింది.. వెంటనే అతడు కూడా కదిలిపోయాడు.. కుక్కను వాటేసుకున్నాడు.. అతడి ముఖంలో ఆనందం కనిపించింది. కీవ్ లో ఉన్న మెడికల్ సెంటర్ లో ఎంతో మంది వార్ వెటరన్(యుద్ధాలు చేసొచ్చిన వారు) లు థెరపీ తీసుకుంటూ ఉన్నారు. వీరందరికీ రికీ స్నేహితుడిగా మారింది.

ఎంతో మంది అప్పట్లో ఉక్రెయిన్ సైన్యంలో పనిచేసి రష్యాకు వ్యతిరేకంగా పోరాడారు. కొందరు గాయపడి చికిత్స కూడా చేయించుకున్నారు. మరి కొందరు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్(ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నామని.. ఎవరో దాడి చేస్తున్నరని.. బంకర్ లో దాక్కున్నామని ఇలాంటి భయాలతో మానసికంగా కలత చెందడం) తో బాధపడుతున్న వారెందరో..! వారందరికీ థెరపీ డాగ్స్ ఎంతగానో సహాయం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దేశంలో వేర్పాటుదారులతో జరిగిన పోరాటంలో 13000 మంది ప్రాణాలు కోల్పోయారు. 4000 మంది ఉక్రెయిన్ సైన్యం కూడా చనిపోయారు. దాదాపు 10000 మందికి పైగా సైనికులు గాయాలపాలయ్యారు. వార్ వెటరన్లు మానసికంగా దృఢంగా అవ్వాలంటే కుక్కలతో సావాసం ఎంతో సహాయం చేస్తుందని భావించిన ఓ గ్రూప్ థెరపీ డాగ్స్ ను మెడికల్ సెంటర్స్ కు తీసుకుని వచ్చారు.

2014 లో ఉక్రెయిన్ లో యుద్ధం ముగిశాక.. సోవియట్ యూనియన్ నుండి విడుదలైన చాలామంది సైనికులు మానసికంగా కృంగిపోయారట. ఉక్రెయిన్ సైన్యంలో సేవలు అందించిన వాళ్ళు కూడా మెంటల్ హెల్త్ అన్నది చాలా దారుణంగా పడిపోయిందని ప్రభుత్వానికి చెప్పుకొచ్చారు. దీంతో వాలంటీర్లు, ఫిజియాలజిస్టులతో కలిసి మాజీ సైనికుల్లో మానసికంగా పరివర్తన తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ బాధపడుతున్న వారికి మెడికల్ సెంటర్లలో ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. అందులో కుక్కలతో మనుషులకు ఏర్పడే అనుబంధం చాలా మార్పులను తీసుకుని వచ్చిందట. కుక్కలను తీసుకుని రావడానికి, వాటి ఆలనా పాలనా చూసుకోడానికి ప్రభుత్వం నుండి చిన్న మొత్తంలో ఫండింగ్ రావడం కూడా మంచిదైందని సైకాలజిస్ట్ రోడియన్ గ్రిగోర్యాన్ చెప్పుకొచ్చారు. పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతున్న సైనికుల వివరాలను చాలా రహస్యంగా కూడా ఉంచుతామని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వార్ వెటరన్స్ లో 10 శాతం మందికి పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అన్నది ఉంటుందని.. గతం గుర్తుకు రావడం, డిప్రెషన్, అగ్రెసివ్ గా ప్రవర్తించడం, తమకు తామే హాని తలపెట్టుకునేలా చేసుకుంటూ ఉంటారని వివరించారు సైకాలజిస్టులు. ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా వెళతారని అంటున్నారు. 2018 లో ఉక్రెయిన్ వార్ వెటరన్స్ ఏకంగా 1000 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారట. సైన్యంలో నుండి వచ్చేశాక సాధారణ ప్రజలతో కలిసిపోలేక కూడా ఇబ్బంది పడేవారట. వీరి మనస్సులో మార్పులు తీసుకురావడానికి డాగ్ థెరపీ ప్రోగ్రామ్ ను తీసుకుని వచ్చారు.

కెనడియన్ ఇన్స్ట్రక్టర్స్ సహాయంతో 2015 లో ఈ డాగ్ థెరపీని ప్రవేశపెట్టినట్లు ఈ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ ఓల్గా స్మిర్నోవా తెలిపింది. ఇప్పటి వరకూ 1000 మందికి పైగా వార్ వెటరన్స్ జీవితాల్లో మార్పులు గమనించామని చెబుతున్నారు. రికీ లాంటి మరిన్ని కుక్కలు 'హీరో'స్ ఫ్రెండ్' ప్రోగ్రామ్ లో భాగమయ్యాయి. రికీ గత నాలుగేళ్లుగా సేవలను అందిస్తోంది. కుక్కలతో కలిసిపోవడం ద్వారా.. తమకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని ట్రీట్మెంట్ లో భాగమైన కొందరు చెబుతున్నారు. ఓ వ్యక్తికి ప్యానిక్ అటాక్ తో బాధపడుతూ ఉన్న సమయంలో రికీ అతడి పక్కనే పడుకుని పూర్తిగా ప్రశాంతత వచ్చే వరకూ అతడితోనే ఉందట. డాగ్ థెరపీ ప్రోగ్రాం లో భాగమైన చాలా మందిలో ఆందోళనలు, డిప్రెషన్లు బాగా తగ్గిపోయినట్లు గుర్తించారు. వార్ వెటరన్స్ కూడా తమతో ఈ కుక్కలు ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉందని.. మానసికంగా ఎంతో ప్రశాంతత నెలకొందని చెప్పుకొచ్చారు.

Next Story