పగటి సమయాల్లో రెక్కీ.. రాత్రి సమయాల్లో టార్గెట్
By Newsmeter.Network Published on 16 Jan 2020 8:23 AM GMTహైదరాబాద్: పగటి సమయాల్లో కాలనీల్లో నడుచుకుంటూ రెక్కీ.. రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్. ఇదే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన పాత నేరస్థుడు గలంకి రాంబాబు పని. ఈ ఘరానా దొంగను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎల్బినగర్ జోన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రాంబాబును ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు అభరణాలు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బినగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నిందితుడిపై ఇప్పటికే 9 కేసులు నమోదు అయ్యాయి.
2015లో హైదరాబాద్ పోలీసులు రాంబాబుపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. 2018 సంవత్సరంలో బయటకు వచ్చిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. విలాసవంతమైన జీవితం గడపడం అడ్డదారులు తొక్కుకు మానలేదు. ఇటీవల చోరీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో పోలీసులు దొంగలపై దృష్టి పెట్టారు. పాత నేరస్థుడు రాంబాబు పోలీసుల కంటపడి చిక్కుకున్నాడు. ప్రస్తుతం రాంబాబును పోలీసులు రిమాండ్‌కు తరలించారు.