రశ్మీ థాక్రే.. ఓ నేపథ్య మహా శక్తి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 26 Aug 2020 1:17 PM GMTప్రతి మగవాడి విజయం వెనక ఓ మహిళా శక్తి ఉంటుందన్న మాట బహుశా రశ్మీఠాక్రే లాంటి మహిళల్ని చూసి అని ఉంటారేమో అనిపిస్తుంది. మహారాష్ట్రను శాసించే ఆ కుటుంబాన్ని ప్రత్యక్ష ఎన్నికలో దింపి భర్తకు, కుమారుడికి అఖండ విజయం సాధించిన అపూర్వ మహిళ రశ్మీ థాక్రే. మహారాష్ట్ర రాజకీయాలపై సునిశిత ప్రవేశమున్న రశ్మీ థాక్రే.. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.
రశ్మీ ముంబై జెజెస్కూల్ ఆఫ్ ఆర్ట్సలో పట్టా పుచ్చుకున్నారు. ముంబైలోని దంబ్బిల్ ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రశ్మీ తండ్రి మాధవ్ పటాంకర్ వ్యాపారి. తల్ల మీనతాయ్ గృహిణి. రశ్మీ 1987లో ఎల్.ఐ.సి.లో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో బాల్‌థాక్రే తమ్ముడి కొడుకు, మహారాష్ట్ర నిర్మాణసేన అధినేత రాజ్‌థాక్రే, సోదరి జయవంతితో స్నేహమేర్పడింది. ఈ తర్వాత ఉద్దవ్‌తోనూ పరిచయం ఏర్పడటం అది క్రమంగా ప్రేమగా చిగురించడంతో 1989లో ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
రశ్మీ థాక్రేను పార్టీ కార్యకర్తలు వాహినీ సాహెబ్‌గా అభిమానంతో పిలుస్తుంటారు. బాల్ థాక్రే. 1966లో శివసేనను స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ తరఫున థాక్రే. కుటుంబం ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పనిచేయలేదు. అయితే రశ్మీ థాక్రే. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాక పరిస్థితుల్లో మార్పు కనిపించింది. అప్పటిదాకా బాల్ థాక్రే. చిన్నకుమారుడు ఉద్దవ్‌కు కూడా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు లేవు. కానీ గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఉద్దవ్–రశ్మీల పెద్ద కమారుడు ఆదిత్య అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ స్థానం నుంచి పోటీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అతణ్ణి ముఖ్యమంత్రి చేసేందుకే రశ్మీ థాక్రే. పావులు కదిపారన్న మాటలూ వినిపించాయి. అయితే ఎన్నికల అనంతరం అనూహ్య పరిణామాల మధ్య ఉద్దవ్ ముఖ్యమంత్రి కాగా, ఆదిత్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఉద్దవ్ తొలుత ఇక యాడ్ ఏజెన్సీ నడిపారు. ఆయనకు వైల్డ్ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. అయితే ఏజెన్సీ విజయవంతం కాలేదు. ఉద్దవ్‌కు రాజకీయాలంటే పొసగేది కాదు. కానీ రశ్మీ అలా కాదు. ఆమెకు అధికారం అంటే ఎలా ఉంటుందనే విషయంగా చక్కని అవగాహన ఉండేది. రశ్మీకి పెద్దలంటే చాలా గౌరవం. తల్లిదండ్రులు, అత్తామామల్ని గౌరవంగా చూసేవారు. బంధాలు గట్టిగా ఉంటేనే జీవితం బావుంటుదన్న తత్వం ఆమెది.. అని ఆమె మేనమావ దిలీప్ చెబుతారు. బాల్‌థాక్రేకు అస్వస్థంగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చే అతిథులకు మర్యాదలు చేసే పెను బాధ్యతను రశ్మీ స్వీకరించారు. బాల్ థాక్రే అనంతరం శివసేన అధినేతగా ఉద్దవ్,రాజ్‌లలో ఎవరన్న సమస్య తలెత్తినపుడు ఉద్దవ్‌నే శివథాక్రే ఎంపిక చేయడం వెనక రశ్మీ ప్రమేయం ఉందని అప్పట్లో వినవచ్చిన సమాచారం. అప్పట్నుంచి ఉద్దవ్–రాజ్ ల మధ్య అంతర్గత కారణాలేంటో తెలీవు గానీ రాజ్‌థాక్రే బైటకి వెళ్ళి మరోపార్టీ స్థాపించారు.
అప్పుడే ఉద్దవ్ సామ్నా పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. రాజకీయలపై పెద్దగా ఆసక్తి లేని ఉద్దవ్‌లో ఆ ఆకాంక్ష బలపడటానికి సామ్నా పత్రిక దోహదపడింది. బాల్ థాక్రే మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్దవ్ ఆ పార్టీని సమర్థంగా నిర్వహించగలుగుతున్నారంటే.. రశ్మీ చోదకశక్తిగా ఉండటం కూడా ప్రధాన కారణమని అంటారు. క్రమంగా శివసేన మహిళా విభాగం బాధ్యతలు రశ్మీ చేపట్టారు.కుమారుడు ఆదిత్య చిన్నవయసులోనే రాజకీయ అరంగేట్రం చేసేలా తనను ప్రభావితం చేశారు. ఆదిత్యకు పార్టీ యువజన అధ్యక్ష పదవి దక్కింది. ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యాక రశ్మీ సామ్నా బాధ్యతలు చేపట్టారు.
రశ్మీ థాక్రేలో ఇదంతా ఒక కోణమైతే మరో పార్శ్వం ఆమెకు సంగీతమంటే ప్రాణం. చక్కగా పాడుతారు. ఉస్తాద్ గులాం అలీ గజల్స్ అంటే విపరీతమైన అభిమానం. ఇటుకుటుంబ నిర్వహణలోనూ.. అటు పార్టీ నిర్వహణలోనూ రశ్మీ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె సామ్నా పత్రిక సంపాదకత్వ బాధ్యతలు వహించింది కేవలం అలంకారప్రాయంగా కాదని మున్ముందు రశ్మీ రాజకీయ వ్యూహం చాలా అనూహ్యంగా ఉండబోతోందని శివసేనకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు భరత్ కుమార్ వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్ర రాజకీయాల్లో తమ కుటుంబాన్ని క్రియాశీలకంగా ఉంచడమే కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకునేలా చేసిన రశ్మీ థాక్రే మహారాష్ట్రలో అత్యంత ప్రభావాత్మక నేపథ్య శక్తిగా అవతరించారు.