ఎత్తులు వేసే నాయకులే చిత్తయిపోతున్నారు
By సుభాష్ Published on 21 April 2020 2:59 PM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ అమెరికాను సైతం నిద్రలేకుండా చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లకు మొండితనమే ఎక్కువ అని చెప్పాలి. ఎవరి మాట వినే రకం కాదు. ఎవరు చెప్పినా నిర్లక్ష్యంగా పెడచెవిన పెట్టేస్తారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ట్రంప్‌కు కొంపముంచుతుంది. కరోనా వైరస్ అమెరికాలో సైతం ఉగ్రరూపం దాల్చుతుంది. కరోనా కేసులు అడ్డగోలుగా నమోదవుతూ, మృతుల సంఖ్య కుప్పలు తెప్పలుగా మారుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది అమెరికా పరిస్థితి.
దిక్కుతోచని స్థితిలో ట్రంప్
దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పుకొచ్చిన ట్రంప్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. చివరకు ముఖానికి మాస్క్ కూడా ధరించనని చెప్పేసిన ట్రంప్.. న్యూయార్క్ నగరంలో శవాల దిబ్బగా మారుతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శవాలను సైతం ఖననం చేసేందుకు స్థలం లేక నివ్వెరబోతోంది.
బోరిస్ జాన్సన్ పరిస్థితి దయనీయం
ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆయనే కరోనా బాధితుడయ్యాడు. స్వీయ నిర్బంధంతో పాటు ఐసీయూలోకి వెళ్లిన ఆయన కొన్ని రోజుల తర్వాత బతికి బయటపడ్డాడు. దేశ వ్యాప్తంగా దాదాపు 90వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9వేల మంది వరకూ ప్రాణాలు విడిచారు. ఇప్పుడు ఈ దేశం కరోనా గండం నుంచి గట్టెక్కేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు స్వయంగా ఎలిజబెత్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు త్వరలోనే మెరుగుపడతాయని జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసింది గత 66 ఏళ్లలో బ్రిటన్ రాణి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం ఇది ఐదో సారి. రాణి కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ కూడా కరోనా బాధితుడు.
ఎత్తుగడలు వేయడంలో దిట్ట
ఇక అలగ్జాండర్ బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రజలకు బోరిస్ జాన్సన్‌గా సూపరిచితుడు. బ్రెగ్జిట్‌లో ఇబ్బందులు పడుతున్న సమయంలో థెరెస్సా నుంచి 2019 జులైలో అధికార పగ్గాలు చేతికందుకున్నాడు. బ్రెగ్జిట్ గండం నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారని, బ్రిటన్ బలమైన శక్తిగా ఎదిగేలా చేస్తారని ప్రజలు భావించారు. దీంతో గత సంవత్సరం డిసెంబర్ 12న ఎన్నికల్లోఆయన విజయం సాధించారు.2008-16 మధ్య కాలంలో లండన్ నగర మేయర్‌గా , 2016 నుంచి 18 మధ్యకాలంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. అంతేకాదు బోరిస్ జాన్సన్ మంచి రచయిత, జర్నలిస్ట్. ఒక విధంగా చెప్పాలంటే జిత్తులమారి నాయకుడు. ప్రత్యర్థులపై ఎలాంటి ఎత్తులు వేయాలి.. ఎలాంటి పన్నాగాలు రచించాలనే విషయంలో దిట్ట. కానీ కరోనా విషయంలో చతికిలపడ్డారు. కరోనా తీవ్రతను అంచనా వేయలేక విఫలమైపోయాడు. మార్చి 23ప స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన ఆయన చివరకు లండన్‌లోని సెయింట్ ధామస్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంత్రులు సైతం స్వీయ నిర్బంధం
ఇక బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పాలన బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. బ్రిటన్ మంత్రులు మ్యాట్ హ్యాంకాక్, మైకేల్ గోవ్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారంటే పరిస్థితి ఏ మేరకూ చేయిదాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కరోనా నుంచి బతికి బయటపడ్డ బోరిస్ జాన్సన్ ఆరోగ్య రంగంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.