నవాజ్ షరీఫ్‌కు ఆస్పత్రే జైలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్లేట్లెట్ కౌంట్ ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో వైద్యుల సలహా మేరకు అతని లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. పనామా పత్రాలు కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కార్యాలయం నుంచి నేరుగా లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్ ఆసుపత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు.
అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వస్తుండటంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన చికిత్స పొందుతున్న గదినే తాత్కాలిక సబ్ జైల్ గా ప్రకటించారు. నవాజ్‌ను ఇకపై ఎవరూ కలవకుండా పోలీసులు, భద్రతా దళాలు పహారా కాస్తున్నట్టు తెలుస్తోంది. షరీఫ్ ఆల్ అజీజియా కేసులో ఏడు సంవత్సరాలు, పనామా పత్రాల కుంభకోణం కేసులో పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ప్రస్తుతం ఆయన లాహోర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.