అయోధ్య రామమందిరం నూతన నమూనా విడుదల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 12:31 PM GMT
అయోధ్య రామమందిరం నూతన నమూనా విడుదల

దశాబ్దాల నాటి కల మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. రేపు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు.

శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనాలను మంగళవారం రామ జన్మభూమి ట్రస్ట్‌ విడుదల చేసింది. బయటి నుంచి రామమందిరం ఎలా కనిపిస్తుంది? ఆలయ లోపలి భాగాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను స్పష్టం చేస్తూ.. ఈ ఫొటోలను విడుదల చేశారు. గతంలో రూపకల్పన చేసిన దాని కంటే రెండింతలు పెద్దగా ఆలయాన్ని నిర్మించనున్నారు. కేవలం రాతితో కూడిన స్తంభాలు, గోపురాలతో 161 అడుగల ఎత్తులో మూడంస్తుల రామ మందిరాన్ని కట్టనున్నారు. గోపురాలు, గుమ్మటాల అంతర్గత నిర్మాణశైలి ఎంతో ఆకట్టుకునేలా ఉన్నది.



గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని నిర్మించిన శిల్పి ప్రభాశంకర్ సోంపురా కుమారుడు, ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా (77) అయోధ్య రామ మందిరాన్ని నిర్మించనున్నారు. ఆలయ నమూనా, నిర్మాణ పనుల కోసం 30 ఏండ్ల కిందటే ఆయనను సంప్రదించారు. దీంతో నాటి నుంచి అయోధ్య సమీపంలో రాతి స్తంభాలు, శిల్పాల పనులు జరుగుతున్నాయి. కాగా అయోధ్యలోని రామ మందిరాన్ని నగర శైలి వాస్తు ప్రకారం నిర్మించనున్నట్లు శిల్పి చంద్రకాంత్‌ సోంపురా తెలిపారు.

ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య సింగారించుకుంటోంది. సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతోంది. భక్తిపూరక వాతావరణాన్ని అణువణువునా నింపుకొంటోంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఎటు చూసినా కాషాయ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. జైశ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి.



Next Story