తిండి తిను..కండ పెంచు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2019 9:14 AM GMTకోటి విద్యలు కూటి కోరకే.. అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. పూట గడవడానికి రోజంతా కష్టపడి మనుషులు డబ్బులు సంపాదిస్తున్నారు. ముందు కడుపు నింపుకున్నాకే మనిషి మరో దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలో కొందరికి ఏం తినాలి? ఏం తినకూడదన్న అవగహన కూడా లేదు. మనుషులు కొన్ని తినకూడని ఆహార పదార్థాలు తిని.. లేని, పోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు మధుమేహం, గుండెజబ్బు, రక్తపోటు, కేన్సర్ లాంటివి. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం ఈ సందర్భంగా తిండి విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
వ్యాధుల బారిన పడకుండా, చురుగ్గా ఉండే జీవితం కావలనుకుంటే సురక్షితమైన, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం మేలు. పండ్లు, కురగాయాలు, పప్పుధాన్యాలు, విత్తనాలు, శనగలు, పల్లీలు, ఉలవలు, బొబ్బర్లు, బాదం, వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మనిషి చక్కని ఆరోగ్యంతో పాటు, ఉల్లాసంగా పని చేస్తాడు. వరి, గోధుమ, రాగులు, జొన్నలు వంటి ధాన్యాలను మరపట్టించుకోకుండా తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. భారతీయులు ప్రతిరోజు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతోంది. ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. కొవ్వు పదార్థాలను, ఉప్పు వాడకాన్ని మితంగా తీసుకోవడం చాలా వరకు మంచిది. మంచి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ప్రపంచంలో 82 కోట్ల మంది ఆకలితో ఆలమటిస్తున్నారు. 14.9 కోట్ల ఐదేళ్లలోపు పిల్లలు పోషకాహార లోపం కారణంగా సామర్థ్యానికి తగ్గట్టు ఎదగడం లేదు. 4.9 కోట్ల ఐదేళ్ల లోపు పిల్లలు అధిక ఆహారం కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 67 కోట్ల మంది ప్రజలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. భూమ్మీద మనిషి తినగలిగే మొక్కలు 30 వేలకుపైగా ఉన్నాయి. ఊబకాయ సంబంధిత వ్యాధులపై ప్రపంచ వ్యాప్తంగా ఏటా ప్రభుత్వాలు 140 లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నాయి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి.