దిశ కేసులో కీలక మలుపు... ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు..!

By అంజి  Published on  4 Dec 2019 4:50 PM IST
దిశ కేసులో కీలక మలుపు... ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు..!

హైదరాబాద్‌: దిశ హత్య ఘటన కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులకు కఠినశిక్ష విధించాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొంది. నిందితులను కఠినంగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. నిందితులకు శిక్ష వేయకుండా జాప్యం ఏంటని న్యాయశాఖ కార్యదర్ధి సంతోష్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు అంగీకరిస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర న్యాయశాఖ కసరత్తు చేస్తోంది. ఒక జిల్లా కోర్టుకు స్పెషల్‌ కోర్టు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలు, ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. మహిళలు సరైన రక్షణ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిశ ఘటన కేసు నిందితులు కోర్టు 10 రోజుల రిమాండ్‌ నేపథ్యంలో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మరోసారి నిందితులతో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.

దిశకు మద్దతుగా తృప్తిదేశాయ్‌..

దిశ ఘటన నిందితులకు కఠిన శిక్ష విధించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని భూమాత బిగ్రేడ్‌ సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ క్యాంప్‌ ప్రగతి భవన్‌ ముందు తృప్తి దేశాయ్‌ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృప్తి దేశాయ్‌ దీక్షను అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story