శబరిమల ఆలయ తలుపులు తెరిచారు.. మొదటి రోజు ఏం జరిగిందంటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2019 1:53 PM GMTముఖ్యాంశాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం తలుపులు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన కేరళ ప్రభుత్వం
- శబరిమలకు ప్రచారం కోసం రావొద్దు: కేరళ మంత్రి సురేంద్రన్
కేరళ: శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆలయ శుద్ధి అనంతరం పుజారులు గర్భగుడిని తెరిచారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్ష స్వీకరించిన భక్తులు పంబ నుంచి అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. కాగా ఇవాళ్టి నుంచి డిసెంబర్ 27 వరకు అయ్యప్ప స్వామికి నిత్య పూజలు జరుగుతాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.
ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్వామి దర్శించుకునేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు వెనక్కి పంపారు. కాగా పోలీసులతో ఆ మహిళలు కాసేపు వాగ్వాదానికి దిగారు. 50 ఏళ్ల లోపు మహిళలు ఆలయంలో ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద 10 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా శబరిమలకు ప్రచారం కోసం రావొద్దని, అలా వచ్చే వారికి రక్షణ కల్పించబోమని కేరళ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. తమ బలప్రదర్శనను మీడియాకు తెలిపేందుకు శబరిమల వేదిక కాదని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని తెలిపారు. మీడియా ప్రతినిధులు సంయమనం పాటించాలని మంత్రి సురేంద్రన్ కోరారు. గత ఏడాది కొందరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే నవంబర్ 20 తర్వాత తనకు ప్రభుత్వం భద్రతా కల్పించకపోయినా స్వామి వారిని దర్శించుకుంటానని సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి యువతుల ప్రవేశంపై న్యాయ సలహా తీసుకుంటామని ట్రావెన్ కోర్ బోర్డు సృష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ కీలక తీర్పులు నేడే