నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తూ నిర్ణయం

By Newsmeter.Network  Published on  9 April 2020 7:45 AM GMT
నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తూ నిర్ణయం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా 5,734 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో 166 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈనెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. కేంద్రం నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బంధీగా సాగుతుంది. అంతా అదుపులో ఉందనుకుంటున్న సమయంలో గత వారం రోజుల క్రితం ఢిల్లిలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న పలువురికి వైరస్‌ సోకడం, వారంతా తమతమ రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. వీరికితోడు కాంటాక్ట్‌ కేసులు నమోదు కావటంతో దేశవ్యాప్తంగా భారీగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read : లాక్‌డౌన్‌ వేళ ఏపీలో ఆసక్తికర భేటీ..

ఈ నెల 14న లాక్‌డౌన్‌ ముగింపు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడగించాలని కేంద్రానికి సూచిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడగించాలని ప్రధాని మోదీకి సూచించాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఈనెల 30వరకు పొడగిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదిలాఉంటే కేంద్రం నిర్ణయంకు ముందే ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని 15 జిల్లాల్లో 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ బుధవారం నిర్ణయించారు. తాజాగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలో ఏప్రిల్‌ 30వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒడిశాలో 42 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరిన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read :మైనర్‌ బాలుడిపై పోలీసుల దాష్టీకం..

ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం కరోనా వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేసేందుకు ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ విధించినట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయించిన లాక్‌డౌన్‌ గడువు 14తో ముగియనుంది. దీంతో ఒకవేళ కేంద్రం లాక్‌డౌన్‌పై సడలింపు ఇస్తే రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తారని, ముందుగానే ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ను విధిస్తే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది ఉండదని నవీన్‌ పట్నాయక్‌ భావించినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం 14 తరువాత లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నా.. రాష్ట్రంలో కొనసాగించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. మొత్తానికి పలు రాష్ట్రాలు కేంద్రం నిర్ణయానికి ముందుగానే లాక్‌డౌన్‌ విధిస్తుండటంతో.. మోదీసైతం ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story