మైనర్‌ బాలుడిపై పోలీసుల దాష్టీకం..

By Newsmeter.Network  Published on  9 April 2020 12:25 PM IST
మైనర్‌ బాలుడిపై పోలీసుల దాష్టీకం..

ఓ మైనర్‌ బాలుడిపై పోలీసులు తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఇదేమని పోలీసులను ప్రశ్నించగా.. వారిపైనా దురుసుగా ప్రవర్తించారు. చివరికి మీడియాకు విషయం పొక్కడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలుడిని, కుటుంబ సభ్యులను బెదిరించి ఇంటికి పంపించివేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 17ఏళ్ల మైనర్‌ బాలుడిపై ఉయ్యూరు రూరల్‌ పోలీసులు తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. పెద్ద కర్రలతో కాళ్లు, చేతులపై విచక్షణా రహితంగా కొట్టారు. తలను గోడకేసి కొట్టడంతో ఆ బాలుడు కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Also Read :హెల్త్‌ బులిటెన్‌: దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్‌ కేసులు

కొడుకు జాడ వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆరు నెలల వయస్సు నుంచి గుండె సమస్య ఉన్న వాడిని చితకబాదారంటూ తల్లి రోధిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు ఇలా దారుణంగా కొంటారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదిలాఉంటే తనను ముగ్గురు పోలీసులు దారుణంగా కొట్టారంటూ చికిత్సపొందుతున్న మైనర్‌ బాలుడు కన్నీటిపర్యాంతమవుతూ చెప్పాడు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులను ఆందోళన ఆపాలంటూ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో అప్రమత్తమైన స్టేషన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ట్రైనింగ్‌ ఏసీపీ బాలుడి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగారు. ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిలాఉంటే పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు ఎమైనా తప్పుచేస్తే మందలిచాలని, లేకుంటే హెచ్చరించాలని, అలా కాకుండా మైనర్‌ బాలుడిని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story