ఇక..దాదా శకం..! - పార్ట్‌-1

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 6:36 AM GMT
ఇక..దాదా శకం..! - పార్ట్‌-1

భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన సూపర్‌ స్టార్‌ అతడు. జట్టుకు భారంగా మారిన అనుభవజ్ఞుల కంటే ప్రతిభగల యువకులే మేలంటూ యంగ్‌ టీమిండియాకు శ్రీకారం చుట్టిన దార్శినికుడు. యువ ప్లేయర్లకు బాసటగా ఉంటూ భారత సొంత గడ్డపైనే కాదు ఎక్కడైన బొబ్బిలే అనేలా విదేశాల్లోనూ టీమ్‌ను విజయాల బాట పట్టించిన సిసలైన నాయకుడు. సంచలనాత్మక ఆటతీరుతో దూకుడైన కెప్టెన్సీతో భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన బెంగాల్‌ టైగర్‌ రిటైర్మెంట్‌ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 2014 నుంచి బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సౌరవ్‌ గంగూలీ ఇప్పుడు దేశ క్రికెట్‌ వ్యవస్థలోని అత్యున్నత కుర్చీలో కొలువు దీరాడు. హాట్‌హాట్‌గా ఉన్న బెంగాల్‌ రాజకీయాలు, బోర్డులోని వర్గాల మధ్య ఉద్రిక్తంగా నడుస్తున్న ఆధిపత్య పోరు నడుమ బీసీసీఐ బిగ్‌బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ ముందు సిద్ధంగా ఉన్న సవాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.

భారత క్రికెట్‌ల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కెప్టెన్లు ఎవరంటే? ఠక్కున రెండు పేర్లు స్ఫురణకు వస్తాయి. ఒకటి లెజెండ్రరీ కపిల్‌ దేవ్‌ది కాగా రెండోది బెంగాల్‌ టైగార్‌ సౌరవ్‌ గంగూలీ. వీరిలో ఆధునిక భారత క్రికెట్‌కు దిశ.. దశ నిర్దేశించిన క్రికెటర్‌గా సౌరవ్‌ ఖ్యాతి గడించాడు. లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ తాత్కాలిక కెప్టెనగా కొంతకాలం వ్యవహరించినా టీమ్‌ను సమర్థంగా ముందుకు నడపలేక స్వల్పకాలంలోనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ సంధి కాలంలో గంగూలీ జట్టుకు నాయకుడయ్యాడు. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌, మెరుపు ఫీల్డర్‌ మహ్మద్‌ కైఫ్‌, స్వింగ్‌ సుల్తాన జహీర్‌ ఖాన వంటి యువకులను తెరపైకి తీసుకొచ్చి మేటి క్రికెటర్లగా తీర్చిదిద్దాడు.

సొంత గడ్డపై బొబ్బిలి.. విదేశాల్లో పసికూన

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సారథిగా నియమితుడైన గంగూలీ జట్టులో సమూల మార్పుల చేయడంతో పాటు ప్రతిభగల యువకులకు అన్ని విధాలా అండగా నిలబడ్డాడు.‘సొంత గడ్డపై బొబ్బిలిలా చెలరేగే టీమిండియా విదేశీ పేస్‌ పిచలపై పసికూనలా ఆడుతుంది. టాప్‌-3 సచిన్‌, గంగూలీ, ద్రావిడ్‌ అవుటైతే సైకిల్‌ స్టాండ్‌లా మిగిలన వికెట్లన్ని టపటపా పడిపోతాయి’ అనే అపవాదులను గంగూలీ రూపుమాపుడు. ఫలితంగా 2002లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్‌ ట్రైయాంగుల్యర్‌ సిరీస్‌ను భారత కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ విధించిన 325 పరుగుల లక్ష్యాన్ని భారత ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కైఫ్‌ విన్నింగ్‌ షార్ట్‌ కొట్టగానే నాడు లార్డ్స్‌లో గంగూలీ షర్ట్‌ విప్పి చేసిన సింహనాదం ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. ఆ తర్వాతి ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌ (2003)లో భారత్‌ను రన్నరప్‌గా నిలిపిన దాదా ఆటగాడిగా 2008లో రిటైర్మెంట్‌ తీసుకునేవరకు జట్టుకు విలువైన సేవలందించాడు.

(ఇంకా ఉంది)

Next Story
Share it