పక్షి గూడు కోసం.. కారు వాడకం బంద్.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 14 Aug 2020 5:42 PM ISTఇంట్లో పక్షుల గూడు కనిపిస్తే ఏం చేస్తాం? బూజుర్రతో దులిపేస్తాం. కిటికీల వద్ద చిన్న తేనెతుట్టె కనిపిస్తేనో? ఏముంది దాన్ని తీసేసే దాకా నిద్రపోం. చీమల పుట్ట కనిపిస్తే చాలు కర్రతో కుళ్ళపొడిచేసి.. మళ్లీ అవి కుడుతాయేమోనని బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం. ఇది సర్వసాధారణంగా చాలామందిలో కనిపించే లక్షణం. అయితే కొందరు మాత్రం ప్రకృతి ప్రేమికులుగా.. జీవరాశులపై అమిత ప్రేమను ప్రదర్శిస్తుంటారు. పావురాలకు ధాన్యం వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎండకాలంలో కిటికీల వద్ద పళ్ళేలలో నీరు పోసి పావురాలు దాహం తీర్చుకోడానికి ఓ దారి చూపించే అపార్ట్‌మెంట్ వాసులు చాలామందే ఉంటారు. దేవుడి గుళ్ళవద్ద నేలపై చీమల కోసం చక్కెర చెల్లేవారు లేకపోలేదు.
దుబాయ్ రాజు మరో అడుగు వేసి తన కారుపై పక్షి గూడు పెట్టడంతో వాటికి భంగం కలగరాదని కారు వాడకాన్నే మానేశాడు. చాలా మందికి ఇది అతీ అనిపించవచ్చేమో గానీ, పక్షి ప్రేమికులు మాత్రం దుబాయ్ రాజుని తెగ మెచ్చేసుకుంటున్నారు.
దుబాయ్ రాజు షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్‌బిన్ రషీద్ అల్ ముక్తమ్...పేరు లాగే తన ప్రేమ చాలా విశాలమని తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నాడు. పక్షి ఎంతో పొందికగా కారుపై కట్టుకున్న గూడు చూసిన ఈ జీవకారుణ్య మూర్తి ఏకంగా కారునే వాడరాదని నిర్ణయించుకున్నాడు. కారు వాడాలంటే ఆ గూడును తొలగించాలి.. అంటే ఎన్నో రోజులు ఆ పక్షి గడ్డిపోచలు తెచ్చి తన బిడ్డల కోసం పదిలంగా అల్లుక్ను ఆ గూడును తొలగించడం అమానుషమనిపించిందతనికి.
అదీకాకుండా ఆ గూడులో పక్షి తన గుడ్లను పెట్టింది. అందుకే ఆ పక్షికి తన గుడ్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదన్న ఒకే ఆలోచనతో ఆ రాజు కారు వాడరాదని భావించాడు. అంతేకాదు కారు చుట్టూ పక్షి గూడు భద్రత కోసం ఎర్రటేపు అంటించాడు.
పక్షి ఆ గుడ్లను పొదిగి చిన్నపిల్లలు బైటకొచ్చాక.. వాటికి ఆహారం అందిస్తున్న అపురూప దృశ్యాన్ని వీడియోకరించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. కొన్ని సార్లు చిన్న పనులే జీవితంలో చాలా తృప్తి నిస్తుంటాయి అన్న వాక్యాన్ని జతపరిచాడు. ఇది చూసిన నెటిజన్లు రాజు సహృదయాన్ని ప్రశంసించారు. బోల్డెన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి. వీటి కోసమని కాదు గానీ.. రాజు స్వతహాగా సున్నిత భావాలున్న వ్యక్తి అని ఈ చర్య ద్వారా తెలుస్తోంది.. ఏమంటారు!!