ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో వి జృంభించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య దేశంలో స్వల్పగానే ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఢిల్లిలో వెలుగు చూసిన తబ్లిష్‌ -ఏ – జమాత్‌ సదస్సుకు హాజరైన వారిలో పలువురికి కరోనా పాజిటివ్‌ ఉండటం, పలువురు మృతిచెందడం యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ సదస్సులో పాల్గొన్న పలువురికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో పాటు.. వీరిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు వారుగా గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Also Read : ఢిల్లి ఘటనతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు

తెలంగాణలో ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారు ఆరుగురు మృతిచెందడం, ఏపీలో ఒకే రోజు 17 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న తరుణంలో ఇంత పెద్ద సదస్సుకు ఢిల్లి ప్రభుత్వం ఎలా అనుమతిచిందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీసా నిబంధనలను ఉల్లంఘించి మరీ పలువురు విదేశీయులు ఈ సదస్సులో పాల్గొంటే పోలీసులు ఏం చేశారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన 800 మంది విదేశీయులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వారు భారత్‌లోకి రాకుండా వారిని బ్లాక్‌ లిస్టులో చేర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఒక్క ఇండోనేషియానే కాక మలేషియా, కిర్గిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వీరు టూరిస్టు వీసాలపై భారత్‌కు వచ్చి మత ప్రచార సభలకు, సదస్సులకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు నడుచుకోవటంతో చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు కేంద్రం దృష్టిసారించినట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్