ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. 1251 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 32 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇటు తెలంగాణలోనూ కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంది. 76 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృతి చెందారు. నిన్నమొన్నటి వరకు అంతా అదుపులో ఉందని భావించినప్పటికీ.. తాజాగా ఢిల్లిలో మర్కజ్‌ ప్రార్థనల ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఒకేరోజు ఐదుగురు చనిపోవడం మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.

Also Read :మర్కజ్‌ పార్థనల్లో తెలంగాణ నుంచి 380 మంది.. అప్రమత్తమైన ప్రభుత్వం

రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతగా లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అదే సమయంలో లాక్‌డౌన్‌ను ప్రతీ ఒక్కరూ పాటించాలని, సామాజిక దూరం పాటించాలని కాంటాక్ట్‌ కేసులు నమోదు కాకుండా చూడాలని సూచించారు. దీంతో హమ్మయ్య అనుకున్న ప్రజల్లో 24గంటల్లోనే మళ్లి ఆందోళన మొదలైంది. ఢిల్లిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తుబ్లిగ్‌ – ఏ – జమాత్‌ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి తెలంగాణ నుంచి అనేమంది ముస్లింలు పాల్గొన్నారు. వీరిలో దాదాపు అన్ని జిల్లాల వారు ఉన్నారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీనికితోడు తెలంగాణలో సోమవారం మరణించిన వారంతా ఢిల్లిలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారేనని తేలింది. అప్రమత్తమైన ప్రభుత్వం ఎవరెవరు ఈ మత కార్యక్రమంలో పాల్గొన్నారు అనేదానిపై దృష్టిపెట్టగా పలు జిల్లాల నుంచి 380మంది పాల్గొన్నట్లు తేలింది.

Also Read :కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్‌.. రేపు యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం

ఈ ఘటనతో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఢిల్లిలోని మత ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న వారు 380 మంది అని అధికారులు చెబుతున్నా.. వీరి సంఖ్య అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు వీరు ఢిల్లి వెళ్లి వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారో.. కలిసిన వారిలో ఎంతమందికి వైరస్‌సోకిందోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారులు పలు జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. మర్కజ్‌ పార్థనల్లో పాల్గొన్న వారు ఎవరెవరిని కలిశారు. ఏఏ ప్రాంతాల్లో తిరిగారు అనేదానిపై కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందం వివరాలు సేకరిస్తుంది. ఈ వివరాల ద్వారా ఆయా ప్రాంతాల వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఎవరింటికి వారు పరిమితమైతేనే మేలు..

మర్కజ్‌ పార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకిందని, తెలంగాణలో పాల్గొన్న వారు 380 మంది ఉన్నారని తెలియడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారి ద్వారా ఇంకెంతమందికి ఈ వైరస్‌ సోకుంతుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, ఎవరి ఇండ్లలో వారే ఉండిపోవాలని పేర్కొంటున్నారు. ఒకవేళ తప్పనిసరి అయ్యి వచ్చినా సామాజిక దూరం పాటించాలని లేకుంటే ఈ వైరస్‌ను అదుపు చేయడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. తాజా పరిస్థితులను చూస్తుంటే.. నిన్నమొన్నటి వరకు తెలంగాణలో వైరస్‌ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో తాజా మర్కజ్‌ ఘటన రాష్ట్రాన్ని రిస్క్‌ జోన్‌లోకి వెళ్లేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్‌ సోకి వారి ద్వారా రాష్ట్రంలో కాంటాక్ట్‌ కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులుసైతం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్