మర్కజ్‌ పార్థనల్లో తెలంగాణ నుంచి 380 మంది.. అప్రమత్తమైన ప్రభుత్వం

By Newsmeter.Network  Published on  31 March 2020 4:57 AM GMT
మర్కజ్‌ పార్థనల్లో తెలంగాణ నుంచి 380 మంది.. అప్రమత్తమైన ప్రభుత్వం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను దడదడలాడిస్తోంది. భారత్‌లోనూ ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతోంది. భారత్‌లో దీని వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ను ప్రకటించారు. ఈ లాక్‌ డౌన్‌ను రాష్ట్రాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. ఇదిలాఉంటే తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అందరూ భావించారు. సీఎం కేసీఆర్‌సైతం కాంటాక్ట్‌ కేసులు లేకుండా చూసుకోవాలని, అందరూ అప్రమత్తంగా ఉండి లాక్‌డౌన్‌ పాటిస్తే ఏప్రిల్‌ 7వరకు రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా హమ్మయ్య అనుకొనే సరికి.. తెలంగాణకు ఢిల్లిలో జరిగిన మత ప్రార్థనల రూపంలో పెద్ద పెనుముప్పు ముంచుకొచ్చింది.

Also Read :ఏప్రిల్‌ 2వరకు కీలక దశ.. కరోనాపై బాల జ్యోతీష్యుడు ఏం చెప్పాడంటే..?

మార్చి 1 నుంచి 15 వరకు ఢిల్లిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తబ్లిగ్‌ - ఏ - జమాత్‌ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లోనూ అనేక జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వేర్వేరు చోట్లనుంచి అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఆరుగురు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆదివారం వరకు ఒకరు మరణించినట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. మొత్తం ఆరుగురు మృతిచెందారని ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠమొదలైంది. మరణించిన వారిలో గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, అపోలో గ్లోబల్‌ ఆసుపత్రులు, నిజామాబాద్‌, గద్వాల పట్టణాల్లో ఒక్కొక్కరు మరణించారని ప్రభుత్వం తెలిపింది. వీరంతా ఢిల్లిలో నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మతపరమైన సమావేశంలో పాల్గొన్నవారేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read :కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్‌.. రేపు యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం

ఇదిలాఉంటే ఢిల్లిలో మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో తెలంగాణ వారు 380 మంది ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో హైదరాబాద్‌ నుంచి 186 మంది, నిజామాబాద్‌ నుంచి 18 మంది, మెదక్‌ 26, నల్గొండ 21, ఖమ్మం 15, అదిలాబాద్‌ 10, రంగారెడ్డి 15, వరంగల్‌ 25, కరీంనగర్‌ 17, మహబూబ్‌నగర్‌ 25, బైంసా 11, నిర్మల్‌ 11, ఖమ్మం 9, కొత్తగూడెం నాలుగు, మణుగూరు ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు కరోనా అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేయించే పనిలో పడ్డాయి.ఇదిలా ఉంటే మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే వెంటనే వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రావాలని, పూర్తిగా ఉచిత చికిత్స అందించటం జరుగుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారు అధికారికంగా 380 మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపినప్పటికీ.. అనధికారికంగా వీరి సంఖ్య ఎక్కువే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

Next Story