జమ్మూ: జవాన్ల ముందు లొంగిపోయిన ఉగ్రవాది.. భావోద్వేగ వీడియోను షేర్ చేసిన సైనికులు
By సుభాష్ Published on 17 Oct 2020 4:50 AM GMTప్రతి మనిషిలో తప్పులు జరగడం అనేది సర్వసాధారణం. కానీ ఆ తప్పులను సరిదిద్దుకుని నడిచేవాడు నిజమైన మనషి. యుక్త వయసులో ఉన్న ఆవేశం, ఉడుకు రక్తం.. అర్ధం లేని ఆలోచనలు.. గమ్యం లేని లక్ష్యం.. ఇవన్నీ బతుకు ముందుకు సాగేవి కాదు. మన ప్రాణాలకు ముప్పు తెచ్చేవే. కానీ ఇవన్నీ కూడా ఓ యువకున్ని ఉగ్రవాదంలోకి నెట్టేలా చేశాయి. కానీ తాను చేసిన తప్పులు తెలుసుకోవడానికి ఆ యువకునికి ఎన్నో రోజులు పట్టలేదు. ఉగ్రవాదంలో చేరిన ఆ యువకుడు ముష్కరులు జరిపే కాల్పులు, రక్తపాతం కళ్లారా చూడటం వంటివి ఆ యువకునికి ఇమడలేకపోయాయి. ఉగ్రవాదంలో చేరిన ఆ యువకుడి గురించి విలపిస్తున్న ఆ తండ్రి బాధ చూడలేకపోయాడు. చివరికి ఉగ్రవాదం నుంచి బయటకు వచ్చి జవాన్ల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకుంది.
ఈనెల 13వ తేదీన ఓ స్పెషల్ పోలీసు ఆఫీసర్ రెండు ఏకే-47 తుపాకులతో కనిపించకుండా పోయాడు. అదే రోజు చదూర ప్రాంతంలో జహంగీర్ భట్ అనే యువకుడు ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆ ఉగ్రవాదే జహంగీర్ అని గుర్తించాయి భద్రతా బలగాలు. జవాన్లు అతని తండ్రిని ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చారు. తండ్రి చేత అతన్ని లొంగిపోవాలని చెప్పించారు. అయితే భయంతో వణుకుతూ ఓ పొదల చాటున దాక్కుని ఉన్న ఉగ్రవాది జహంగీర్ తండ్రి మాట విని ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం నీకేం కాదు.. నిన్నెవ్వరూ కాల్చరు. నీ ప్రాణాలకు ఎలాంటి ఢోకా ఉండదు.. వచ్చి లొంగిపో.. నీకేం కాదు.. మా వద్దకు రా.. నీకు అండగా ఉంటాము.. అని జవాన్ ఇచ్చిన హామీపై ఆ ఉగ్రవాదికి ఎనలేని నమ్మకం కలిగింది. ఉగ్రవాదం వద్దు.. కుటుంబమే ముద్దు అనుకుంటూ.. వెంటనే తుపాకీని పక్కనబెట్టి.. చేతులు పైకెత్తి నెమ్మదిగా జవాన్ల వద్దకు చేరుకున్నాడు.
అలా వచ్చిన అతనికి సైనికులు తాగేందుకు నీళ్లు ఇచ్చి ధైర్యం చెప్పారు. తప్పులు జరుగుతుంటాయి.. నీకు ఏమి కాదు.. వాటిని సరిదిద్దేందుకు నువ్వు ప్రయత్నించావు..నీలో అది నచ్చింది. నీ ప్రాణాలు ఎలాంటి హామీ ఉండదు అంటూ.. సైనికులు భరోసా ఇచ్చారు.
నా కొడుకును కాపాడినందుకు జవాన్లకు తండ్రి కృతజ్ఞతలు
గమ్యం లేని ఆలోచనలతో ఉగ్రవాదం వైపు వెళ్లిన నా కొడుకును కాపాడినందుకు జహంగీర్ తండ్రి జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. లేనిపోని ఆలోచనలతో ఉగ్రవాదం వైపు వెళ్లిన నా కొడుకు తిరిగి రావడం సంతోషంగా ఉంది. మీమ్మల్ని ఎప్పుడు మరువలేము అని తండ్రి జవాన్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనికీ ధైర్యం చెప్పిన సైనికులు.. ఇంకెప్పుడు తన కొడుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జవాన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
�