హైదరాబాద్ వినువీధిలో 10 మెగా బలూన్లు
By రాణి Published on 21 Jan 2020 12:56 PM ISTముఖ్యాంశాలు
- రీసెర్చ్ కోసం ఆశాశంలోకి మెగా బలూన్లు
- బలూన్లలో హైడ్రోజన్ గ్యాస్
- వాతావరణంలోని మార్పులను అవి అధ్యయనం చేస్తాయి
- ఇవి అత్యంత కీలకమైన సైంటిఫిక్ అధ్యయనాలు
- చిన్న ఇబ్బంది కలిగినా మొత్తం డేటా లాస్
చాలా ఎక్కువ ఎత్తులో గాలిలో వివిధ రకాలైన సైంటిఫిక్ పరిశోధనలు చేసేందుకుగానూ హైదరాబాద్ గగనతలంలోకి త్వరలోనే పది మెగా బలూన్లను వదలబోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ మిషన్ ని సూపర్ వైజ్ చెయ్యబోతున్నాయి. సన్నటి పాలీ ఎథిలీన్ తో తయారైన పెద్ద బలూన్లలో హైడ్రోజన్ గ్యాస్ ని నింపి ఈసీఐఎల్ సమీపంలో ఉన్న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రాంగణం నుంచి గాల్లోకి వదులుతారు. ఇవి 50 నుంచి 85 మీటర్ల వ్యాసంతో ఉంటాయి. సాధారణంగా రాత్రి 8 గంటలనుంచి ఉదయం 6 గంటల మధ్య సమయంలో బెలూన్లను గాల్లోకి వదులుతారు.
ఆ సమయంలో వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి అవి తేలిగ్గా పైకెళ్లిపోతాయి. జనవరి మూడో వారంలో మొట్టమొదటి బెలూన్ గాల్లోకి ఎగురుతుంది. ఏప్రియల్ 30కల్లా మిగతా బెలూన్లన్నింటినీ ప్రయోగిస్తారు. ఇవి గాల్లో దాదాపు 35 నుంచి 45 కిలోమీటర్ల ఎత్తుకు ఆకాశంలో ఎగురుతాయి. వీటిలో ఉన్న సైంటిఫిక్ పరికరాలు వాతావరణానికి సంబంధించిన అధ్యయనం ఆటోమేటిగ్గా చేసుకుంటూ వెళ్లేలాగా ముందస్తు ఏర్పాటు ఉంటుంది.
దాదాపుగా పది గంటల పాటు ఆటోమేటిగ్గా సైంటిఫిక్ పరికరాలు పనిచెయ్యడం అధ్యయనం పూర్తవడం ఒకదానికి తర్వాత ఒకటిగా జరిగిపోతాయి. పని పూర్తైన తర్వాత గాలి వాలును బట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 నుంచి 350 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా కిందపడొచ్చు. సాధారణంగా ఈ బెలూన్లు విశాఖపట్నం - హైదరాబాద్ - షోలాపూర్ రహదారి పక్కగా ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. వాటిలో ఉన్న పేలోడ్ ఇన్ స్ట్రుమెంట్స్ మాత్రం తెలంగాణ పరిధిలో ఉన్న జిల్లాల్లోనే పడే అవకాశం ఉటుంది. శాస్త్రవేత్తలు ఓపికగా అవి ఎక్కడ పడ్డాయన్న విషయాన్ని గుర్తించి, వాటిని తీసుకొచ్చి రీసెర్చ్ ఫలితాలను అధ్యయనం చేస్తారు.
కిందపడ్డ ఎక్విప్ మెంట్ ని ముట్టుకోవడానికి వీల్లేదు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. ఇరవై నుంచి నలభై మీటర్ల పొడవున్న పెద్ద పెద్ద తాళ్లతో బెలూన్లకు కట్టి ఉన్న పారాచూట్ల సాయంతో ఈ బలూన్లు సాధారణంగా మెల్లగా నేలమీదికి వచ్చేస్తాయి. ఇలా కిందపడ్డ బలూన్లనుకానీ, సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ పేలోడ్ నిగానీ ఎవరూ ముట్టుకోకూడదు. సాధారణంగా గాల్లోంచి ఏదో పెద్ద బలూన్ కిందపడిందంటే జనం పోలోమని పరిగెత్తుకెళ్లి దాన్ని లాగి పీకి అందులో ఏముందో చూసేందుకు ప్రయత్నిస్తారు.
కానీ అలా చేయడం వల్ల పరిశోధనల ఫలితాలు దెబ్బతినే అవకాశం పూర్తిగా ఉంటుంది కనుక ఎట్టిపరిస్థితిలోనూ వాటిని ముట్టుకోకుండా జాగ్రత్తగా అవి ఎక్కడ పడ్డాయో, కచ్చితంగా అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సైంటిస్టులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాటిమీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంగానీ, లేదా దానిపై ఉన్న అడ్రస్ కి టెలిగ్రామ్ ఇవ్వడంగానీ లేదా సమీపంలో ఉన్న పోలీస్టేషన్ లో వెంటనే సమాచారం ఇవ్వడంగానీ చెయ్యాలని కోరుతున్నారు. భద్రత కోసం ఈ బలూన్లలో ఉన్న పరికరాలన్నింటినీ అల్యూమినియం చట్రాలు, చక్కపెట్టెల్లో పకడ్బందీగా అమరుస్తారు. వీటిలో అత్యంత సున్నితమైన అధునాతనమైన పరికరాలు, సైంటిఫిక్ డేటా ఉంటాయి. కొన్నింటిలో అయితే అత్యధిక వోల్టేజీ కలిగిన పరికరాలు ఉంటాయి. స్థానికులు అత్యుత్సాహంతో వీటిని పగలగొట్టి తెరిచిచూస్తే దానివల్ల వాళ్లకు ఎలాంటి ఉపయోగం ఉండక పోగా, అందులో ఉన్న సైంటిఫిక్ డేటామొత్తం పాడైపోతుంది. పరికరాలు పూర్తిగా పనికిరాకుండాపోతాయ్.
అందువల్ల సైంటిస్టులు వాటిని తెరిచి చూడడానికి ఏమాత్రం వీల్లేదన్న హెచ్చరికలను కూడా ఆ బెలూన్ల మీద, పరికరాలు ఉన్న పెట్టెలమీద పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. నిజానికి వీటిని తెరిచి చూడడం నేరంకూడా. అలా ఖచ్చితంగా ఎవరు ఆ పెట్టెల్ని పగలగొట్టి చూశారో తెలిస్తే స్థానిక పోలీస్టేషన్ లో వెంటనే వాళ్లమీద కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలా ఆ బెలూన్లు ఫలానా చోట కనిపించాయన్న సమాచారాన్ని ఫోన్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, వ్యక్తిగతంగా వెళ్లి చెప్పడం ద్వారా తెలియజేసిన వ్యక్తులకు సైంటిస్టులు వాళ్లు పెట్టిన ఖర్చులతోపాటుగా తగిన పారితోషికాన్నికూడా అందజేస్తారు. కానీ కిందపడిన ప్యాకేజీల పెట్టెలు ఏమాత్రం డ్యామేజీ అయినా సరే పారితోషికం దక్కదు. ఎందుకంటే ఎంత పకడ్బందీగా ప్యాక్ చేసినా సరే స్థానికులు ఎవరైనా ఆ ఎక్విప్ మెంట్ ని ముట్టుకుంటే దాంట్లో ఉన్న డేటామొత్తం పాడైపోతుంది.