కరోనా ఎఫెక్ట్‌: ఆలయాలు, పర్యాటక స్థలాల మూసివేత

By సుభాష్  Published on  16 March 2020 2:34 PM GMT
కరోనా ఎఫెక్ట్‌: ఆలయాలు, పర్యాటక స్థలాల మూసివేత

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల మందికిపైగా మృతి చెందారు. దాదాపు రెండు లక్షల వరకు కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఫిబ్రవరిలో భారత్‌లో కూడా ప్రవేశించింది. ఇప్పటికే ఇద్దరు మరణించగా, వందకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీని ప్రభావం పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్‌ మాల్స్‌, సినీ ఇండస్ట్రీలపై పడింది. ఇక పర్యాటక స్థలాలు సైతం వెలవెలబోతున్నాయి. ఇక తాజాగా పుణ్యక్షేత్రాలపై కరోనా ప్రభావం చూపుతోంది. భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ముంబైలోని సుప్రసిద్ది ఆలయమైన శ్రీ సిద్ది వినాయక ఆలయంపై పడింది. సోమవారం నుంచి ఈ ఆలయాన్ని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆలయం మూసి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆలయానికి భక్తుల రాకను నిషేధిస్తున్నట్లు మహారాష్ట్ర సర్కార్‌ తెలిపింది.

అంతేకాదు అజంతా, ఎల్లోరా గుహలను సైతం మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక షిర్టీ సాయిబాబా దర్శనాలను భక్తులు వాయిదా వేసుకోవాలని శ్రీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ సూచనలు చేసింది. ప్రస్తుతం ఆలయంలో 11 థర్మల్‌ స్క్రీనింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా పలు ఆలయాలపై కరోనా ప్రభావం చూపింది. మహాంకాళేశ్వర్‌ ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. మార్చి 31వ తేదీ వరకు ఈ నిషేధం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో..

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం భారీగానే చూపుతోంది. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ లను మూసివేస్తున్నట్లు నిన్న తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కరోనా వల్ల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే టైం స్లాట్‌ టోకెన్ల ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుమలకు విదేశాల నుంచి వచ్చే వారు 28 రోజుల తర్వాతే దర్శనానికి రావాలని టీటీడీ సూచిస్తోంది.

Next Story