ఆదాయ‌ప‌న్ను వ‌సూళ్ల‌లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 March 2020 1:30 PM GMT
ఆదాయ‌ప‌న్ను వ‌సూళ్ల‌లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయంటే?

కేంద్రానికి ప్ర‌భుత్వానికి ముఖ్య ఆదాయ వ‌న‌రుగా ఉండే ఐటీ శాఖ‌కు సంబంధించి ఆసక్తికర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. గడిచిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఆదాయపన్ను కింద దేశ ఖజానాలో ఎంత మొత్తం జమైంది? ఏయే రాష్ట్రాల‌ నుండి ఎంత ప‌న్ను వ‌సూలైంద‌నే వివ‌రించాలి అనే ప్ర‌శ్న కేంద్ర ఆర్థిక‌మంత్రికి ఉత్ప‌న్న‌మైంది. ఈ విష‌య‌మై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స‌ద‌రు ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఈ జాబితాలో భారీ ఆదాయాన్ని అందిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొద‌టిస్థానంలో నిల‌వ‌గా.. ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానానికి పరిమితమ‌వ‌గా.. ఏపీ పద్నాలుగో స్థానంలో నిలిచింది.

ఇదిలావుంటే.. గ‌త‌ ఆర్థిక సంవత్సరం 2019-2020లో రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఆదాయపన్ను కింద జమ అయిన మొత్తాల్ని చూస్తే.. మహారాష్ట్ర రూ.2,97,957 కోట్లతో ప్ర‌థ‌మ‌స్థానం, ఢిల్లీ రూ.108579 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల‌యిన‌ కర్ణాటక, తమిళనాడు త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. ఆదాయపన్ను వసూళ్లలో చాలా వెనుకబడి ఉంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో గుజ‌రాత్‌లో కేవలం రూ.46వేల కోట్ల వసూళ్లు మాత్రమే జ‌రిగాయి. డెవలప్ మెంట్ విషయంలో వెనుకబడిన రాష్ట్రంగా చెప్పే పశ్చిమబెంగాల్ తర్వాత తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.37806కోట్లు, ఏపీ నుండి రూ.13446 కోట్లు వ‌సూలు అవ‌డం విశేషం.

Next Story