కౌంటర్‌ దాఖలు చేయండి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..!

By అంజి  Published on  19 Jan 2020 9:13 AM GMT
కౌంటర్‌ దాఖలు చేయండి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..!

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో ఓయూ ప్రొఫెసర్‌ చింతకింది కాశీమ్‌ హెబియాస్‌ కార్పస్‌ పిటిషన్‌ పై విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు కాశీమ్‌ను చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చైహాన్‌ ముందు గజ్వేల్‌ పోలీసులు హాజరుపర్చారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రఘునాథ్‌ తన వాదనలు వినిపించారు. కాగా కాశీమ్‌ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే గురువారం వరకు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. కాశీమ్‌ కుటుంబ సభ్యులను కలవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో కాశీమ్‌ తన కుటుంబ సభ్యులను కలిశారు. తదుపరి విచారణను హైకోర్టు గురువారంకు వాయిదా వేసింది.

శనివారం ఉదయం గజ్వేల్‌ ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాల కోసం వచ్చిన పోలీసులు.. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చారని, కంప్యూటర్‌కు సంబంధించిన హార్డ్‌ డిస్కులు, ఇతర పుస్తకాలు తీసుకెళ్లారు. ప్రొఫెసర్‌ కాశీమ్‌ అరెస్ట్‌పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం ఒక్కసారిగా భగ్గుమంది. కాశీమ్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటి దగ్గరకు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ రెవెల్యుషనరి గా పనిచేస్తూ మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగిందని సిద్ధిపేట పోలీసు కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఇతర మావోయిస్టులతో సెంట్రల్ కమిటీ మెంబర్‌లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సెంట్రల్ కమిటీ ఇచ్చే డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీస్‌ కమిషన్‌ పేర్కొన్నారు.

మావోయిస్టుల‌తో సంబంధాలు ఉన్నాయ‌నే అనుమానంతో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్రొఫెసర్ కాశీమ్ ఇంట్లో ఇటీవల పోలీసులు సోదాలు చేప‌ట్టారు. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. కాశీమ్ నూతనంగా విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ కాశీమ్ ను ఏ-2గా చేర్చుతూ 2016లో ములుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Next Story