సినీతారల కొత్త అవతారం

By Newsmeter.Network  Published on  5 Dec 2019 1:48 PM GMT
సినీతారల కొత్త అవతారం

స్పోర్ట్స్ లీగ్స్ కి ఆకర్షణ విపరీతంగా పెరుగుతోంది. దీంతో గ్లామర్ ప్రపంచం కూడా స్పోర్ట్స్ రంగంవైపు అడుగులు వేస్తోంది. సినిమా ప్రపంచంలో బిజీగా ఉండే స్టార్లు ఇప్పుడు స్పోర్ట్స్ ఆంత్రపెన్యువర్స్ గా కొత్త అవతారం ఎత్తుతున్నారు.

అత్యంత జనాదరణ కలిగిన, ఆకర్షణీయమైన వివిధ క్రీడారంగాలకు చెందిన స్పోర్ట్స్ ఫ్రాంచైసీలను తీసుకోవడంలో తెలుగు సినీ తారలు ముందంజలో ఉంటున్నారు. రాణా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, అదితి రావ్ లాంటి ఫేమస్ స్టార్లు క్రీడారంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. కేవలం పెట్టుబడులు పెట్టి ఊరుకోకుండా తాము స్పాన్సర్ చేసిన టీమ్ లను ఉత్తేజపరిచేందుకు ముందంజలో ఉంటున్నారు.

ఆసక్తి - వారసత్వం

గతంలో ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న దగ్గుబాటి రాణా ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైసీ హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ లో వాటాదారు అయ్యాడు. తండ్రినుంచి, బాబాయినుంచి క్రీడలపట్ల ఉన్న ఆసక్తిని పుణికిపుచ్చుకున్న ఈ తెలుగు స్టార్ ఆటవిడుపుకోసం ఆటల్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు. దగ్గుబాటి సురేష్ కి, దగ్గుబాటి వెంకటేష్ కి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో జరిగే క్రీడాసంరంభాలకు హాజరయ్యి ఆనందించే అలవాటు మొదటినుంచీ ఎక్కువే. ఆ దారిలోనే పయనిస్తున్న దగ్గుబాటి రాణా అమెరికన్ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ లంటే చెవి కోసుకుంటాడు.

1920నుంచీ హైదరాబాద్ ఫుట్ బాల్ ప్రేమికులకు స్వర్గధామంలా నిలిచింది. ఒకానొక సమయంలో జాతీయ జట్టులో హైదరాబాద్ నుంచి దాదాపుగా ఎనిమిదిమంది ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారుకూడా. మనకున్న అత్యద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన ఒక కోచ్ జీవిత చిత్రాన్ని ప్రతిబింబించే రీతిలో పూర్తి స్థాయిలో ఒక సినిమాకూడా వచ్చింది.

కానీ ప్రస్తుతం మిగతా పెద్ద నగరాలన్నీ ఫుట్ బాల్ క్రీడను ప్రోత్సహించే దిశగా దూసుకుపోతుంటే హైదరాబాద్ మాత్రం ఈ విషయంలో వెనకబడిందని రాణా అంటాడు. రాణా చిన్నతనంలోకూడా ఫుట్ బాల్ మ్యాచ్ లను చాలా ఇష్టంగా చూసేవాడు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన ఈ క్రీడకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రత్యేకించి ఓ ఫ్రాంచైసీలో పెట్టుబడులుపెట్టాడు. క్రికెట్ తోపాటుగా మిగతా క్రీడలన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది తన అభిప్రాయం.

ఆంత్రప్రెన్యుయర్ గా మారడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదంటాడు రాణా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే కష్టాలు, నష్టాలు తప్పవని ఈ యువతరం సూపర్ స్టార్ చెబుతున్నాడు. హెచ్.ఎఫ్.సి సరైన సమయంలో హైదరాబాద్ కు వచ్చిందన్నది తన విశ్లేషణ.

పాఠశాలలుకూడా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో అనేక స్పోర్ట్స్ అకాడమీలు పుట్టుకొచ్చాయి. ఈ కారణంగా నగరంలో ఉన్న ఫుట్ బాట్ టర్ఫ్ లన్నీ పూర్తి స్థాయిలో నిరంతరాయంగా సందడిగా కనిపిస్తున్నాయి.

Rana 2

క్రీడలపట్ల ఆసక్తి

తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కి మొదటినుంచీ క్రీడలంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తిని ఇప్పుడు తను ఆశయంగా మలచుకుని క్రీడలపట్ల తన అభిమానాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఫిట్ నెస్ పై అమితమైన ఆసక్తిని కనబరిచే ఈ ముద్దుగుమ్మ ఎఫ్ - 45 పేరుతో కొన్నేళ్ల క్రితమే నగరంలో ఒక ఫిట్ నెస్ సెంటర్ ని నెలకొల్పింది.

టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో దేదే ప్యార్ దే నటీమణి వాటాదారు అయ్యింది. ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ లో ఆమె గట్టిగానే పెట్టుబడి పెట్టింది. ఢిల్లీ, హైదరాబాద్ టీముల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు రకుల్ హైదరాబాద్ టీమ్ వైపే మొగ్గుచూపింది.

హైదరాబాద్ నగరం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన నగరమని రకుల్ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇక్కడి టెన్నిస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుపులు మెరిపించగలిగే స్థితికి తప్పకుండా చేరుకోవాలన్నది తన ఆకాంక్ష.

అండర్ - 14, అండర్ - 18, ప్యారా విభాగాల్లో జాతీయ స్థాయిలో పోటీపడుతున్న క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని రకుల్ అంటుంది. తను స్పోర్ట్స్ ఆంత్రప్రెన్యువర్ గా మారాలని ఎప్పుడూ అనుకోలేదని, అనుకోకుండా తీసుకున్న నిర్ణయం తనను ఈ వైపుకు లాక్కొచ్చిందని చెబుతుంది. ఫిట్ నెస్ పై ఉన్న ప్రేమ కారణంగానే ఎఫ్ -45 ఫిట్ నెస్ సెంటర్ ని నెలకొల్పానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

Photo

మరో ప్రముఖ తార అదితి రావ్ హైదరీకూడా ఈ రంగంలో ముందంజలో నిలిచింది. పద్మావత్ సినిమాలో కీలక భూమికను పోషించిన ఈ అందాలనటి అమీనా హైదరీ మునిమనవరాలు. సర్ అక్బర్ హైదరీ సతీమణియైన అమీనా 1921లోనే లేడీ హైదరీ క్లబ్ ని నెలకొల్పింది. ఈ మధ్యే చెన్నై స్టాలియన్స్ టీమ్ వాటాలను కొనుగోలు చేసిన అదితి క్రీడలపట్ల తనకున్న ఆసక్తిని ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.

టి.పి.ఎల్ కాన్సెప్ట్ ఇనీషియేటివ్ ను ఇంటింటికీ చేరవేయాలన్న దృఢ సంకల్పంతో, మనోబలంతో ఆమె ఈ రంగంలో దూసుకుపోతోంది. మొదటి సీజన్ లీగ్ ని చూసినప్పుడు యువతరంలో ఉన్న అత్యద్భుతమైన టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోయానంటుందీ అందాల భామ.

అనూహ్యమైన రీతిలో, అత్యున్నత విజయాలను సాధిస్తున్న ఈ క్రీడా రంగంలో అడుగుపెట్టడమే తనకు ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పే అదితి తనకు ఇష్టమైన లీగ్ లో పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాక, తన టీమ్ కి పూర్తి స్థాయి మానసిక ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది.

Aditi Rao

Next Story