రాశి ఫలాలు 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2019 12:27 PM GMT
రాశి ఫలాలు 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు

మేషరాశి:

ఈ రాశివారికి బుధ, చంద్రుల దృష్టి ప్రశాంతతను కలిగిస్తుంది. స్వస్థానాన్ని చూస్తున్న కుజుడు మంచి ఫలితాలను ఇస్తాడు. రవి అష్టమంలో ఉండటం వల్ల పిల్లలకు అనారోగ్యం సూచిస్తోంది. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. దంపతులు ఎడముఖం పెడముఖం అయినా కలిసి ప్రయాణాలు జీవన విధానాలు కొనసాగుతాయి. శని అనుకూలతకూడా ఉంది. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, జీవితంలో పెరుగుదల లేదా బహుమతులు పొందుతారు. భాగ్యంలో శని గురు శుక్ర కేతు చంద్రుల కలయిక ఈ వారంలో ఈ రాశివారికి చాలా యోగించగలదు. గురు శుక్రులు మేలైన స్థిరమైన లాభాలు కలిగిస్తారు. చాలా సమస్యలు వీరికి విడివడ నున్నాయి. పంచానన యోగం బాగా పనిచేస్తుంది. అశ్విని వారికి ప్రత్యక్ తార అయిన యాభై శాతం, భరణి వారికి ఆరోగ్య ప్రాప్తి ధన లాభం ఉంది.కృత్తిక వారికి విపత్తార ప్రతికూలత ఉన్నది. మొత్తం మీద ఈ వారం వీరందరికీ లాభం దాయకమని చెప్పవచ్చు.

పరిహారం: ఈ రాశివారు సుబ్రహ్మణ్యస్వామి పూజ లేదా సర్పసూక్త పారాయణ మంచిఫలితాలను ఇస్తాయి. ఆంజనేయస్వామిని దర్శించండి.

వృషభం:

ఈ రాశివారికి అష్టమంలో 5 గ్రహాలు కలయిక అనేక ప్రమాదాలను, అనారోగ్యాన్ని, ఆయుక్షీణాన్ని సూచిస్తున్నప్పటికీ గురు శుక్రులు వాటికి తరుణోపాయాలను సూచిస్తారు. సప్తమంలో రవి కూడా అనవసర కాలయాపన, అనవసర ధన వ్యయాన్ని కలిగిస్తాడు. ముందు జాగ్రత్తలు చాలా అవసరం. బుద్ధిమాద్యం తగ్గించుకుని, నిదానంగా ఆలోచిస్తేనే ప్రతి సమస్య చిన్నదిగా కనిపించిబఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మస్థైర్యం మనోధైర్యం తగ్గుతున్నాయి. ముందుగా మీకు వస్తున్న హెచ్చరికలను గ్రహించండి. ఎవరి విషయాల్లోనూ లోతుగా ఆలోచించకండి. మీ చేతి వస్తువే మీకు పామై కాటేస్తుంది. అగ్ని ప్రమాదము లేదా ఎలక్ట్రికల్ షాక్ అవకాశాలున్నాయి. దుస్సాహసాలు చేయకండి. ఒంటరిగా ఉండకండి. పలువురి మధ్యలో నిగ్రహించుకుని ఉండండి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి "కొండ అద్దమందు కొంచెమై వుండదా" అన్నట్టు మీకు పోయేదేముంది. 26,27,28, తేదీల్లో మానసిక శాంతిని ఉత్సాహాన్ని పొందుతారు. కృత్తిక వారికి ప్రతికూలత ఎక్కువ. రోహిణి వారికి ధనలాభం. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి అనారోగ్య సూచన.

పరిహారం: ఆంజనేయస్వామికి వడమాల ధారణ చేయించండి. అమ్మవారికి మంగళవారం నాడు ఖడ్గమాలతో పూజ చేయించండి.

మిథునం:

ఈ రాశివారికి లగ్నంలో రాహు ఉన్నప్పటికీ సప్తమంలో శని కేతు గురు శుక్ర చంద్రుల కలయిక మంచి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. షష్ఠంలో రవి శత్రువర్గాన్ని పెంచుతున్నాడు. పంచమ కేంద్రంలో చంద్ర కుజ బుధులు మీకు కాస్తన్నా మేలు చేసే అవకాశం ఉంది. పిల్లలకు ఉద్యోగం గానీ వ్యాపారంగా కలిసొచ్చే అవకాశముంది. భాగ్య,రాజ్య అధిపతులైన శని గురులు మీకు మేలు చేయనున్నారు. అయితే దుస్సాహసం మాత్రం వద్దు. ఎంత అనుకూలత ఉన్నా లగ్న రాహువు తాలూకు ప్రభావం మీపై పని చేయబోతోంది. అందుకనే కొంచెం జాగ్రత్త వహించండి. పట్టిందల్లా బంగారమే అవుతుంది కానీ దానికి కాస్తంత తెలివి తేటలు అవసరం. స్వంత తెలివిని ఉపయోగించు కోలేనప్పుడు మీకు ఈ గ్రహాలు కొంత వ్యతిరిక్తంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. మృగశిర వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆరుద్ర, పునర్వసు మూడు పాదాలు వారికి సత్ఫలితాలు ఉన్నాయి. అందరికీ ఎనభై శాతం మంచి ఫలితాలు వస్తాయి

పరిహారం: శివ కేశవ అర్చన, దధి (పెరుగు, వెండి)చంద్ర దానం కూడా పనిచేస్తుంది శనికి తైలాభిషేకం చేయించి రోజూ ఏదో ఒక దైవ దర్శనం చేసుకోండి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకరాశి:

ఈ రాశి వారికి చంద్ర కుజ బుధులు మేలు చేసే అవకాశం ఉంది. కుమారులకు ఉద్యోగ ప్రాప్తి లేదా అతనికి రావల్సిన తల్లి గారి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. శత్రు స్థానాల్లో ఐదు గ్రహాలు ఉన్నా శుక్ర గురు చంద్రులు మాత్రం మేలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వివాహ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగచ్చు. ముందు జాగ్రత్త వహిస్తే అన్ని అనుకూలతలు ఎక్కువగా మీకున్నాయి. మీకు వ్యయమందు రాహు ఏదో ఒక నష్టాన్ని కలిగించాలని చూస్తూ ఉన్నాడు . అయితే అందుకు తగ్గట్టుగా కేతువు మీ చేత మంచి పని చేయించి లేదా దాన ధర్మ చేయించి నష్టాన్ని తగ్గిస్తాడు. ఒక పెద్దపని పూర్తయిపోతుంది. అనుకున్న పని వాయిదా పడే అవకాశం కూడా ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే సప్తమ స్థానం పై మీకు పట్టు వస్తుంది అనగా వివాహ ప్రయత్నాలు లాభించవచ్చు. పునర్వసు వారికి మంచి ఫలితాలు పుష్యమి వారికి ప్రతికూలత కనిపిస్తుంది. శ్రేష వారికి కార్య సానుకూలత కొనసాగుతోంది.

పరిహారం : గురు ప్రార్థన చేయండి. దత్తాత్రేయ లేదా నమక పారాయణ మంచి కలిగిస్తాయి.

సింహరాశి:

ఈ రాశివారికి 3,4,5 రాశుల్లో ఉన్న గ్రహములు అన్నీ అనుకూలించి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తృతీయమందు కుజ బుధుల తో చంద్రుడు కలయిక మంచిది. అలాగే చతుర్థంలో రవి చంద్రుల కలయిక తల్లిగారి ఆరోగ్యాన్ని జాగ్రత్త చూడమని హెచ్చరికలిస్తున్నాయి. ఇక్కడ క్రమక్రమంగా మంచి ఫలితాన్ని పొందే అవకాశాన్ని సూచిస్తున్నారు. లాభంలో రాహువు కూడా అనుకూలిస్తాడు. ఈ వారం వీరికి చాలా అనుకూలత ఉంది. అయితే తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు సరిగా చదువుల విషయంలో కాస్త అశ్రద్ధ పడతారు వాటిపైనే దృష్టిని సారించండి . ఒక విధంగా మంచి రోజులే అనుకున్నా జాగ్రత్త పడకపోతే అవి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మఖ వారికి ప్రత్యక్తారలతో వారం ప్రారంభం కనుక ప్రతికూలతలు . పుబ్బ వారికి క్షేమ తా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తర వారికి ప్రతికూలతలు ఉన్నా కొంచెం జాగ్రత్త వహించండి

పరిహారం : సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయి. శనికి జపం గురుని అనుగ్రహించడం కోసం గురునకు జపం మంచి ఫలితాలిస్తాయి.

కన్యారాశి :

ఈ రాశి వారికి ధన స్థానంలో చంద్ర కుజ బుధులు అనుకూలించనున్నారు. తృతీయ మందున్న రవి చంద్రుడితో కలిసినప్పుడు కూడా మంచి ఫలితాలకు అవకాశం ఉంది. 4 ఇంట్లో గ్రహములు అన్ని అనుకూలిస్తే మానసిక బాధని మిగిలిస్తున్నాయి. పంచానన యోగం వీరికి లాభం కలిగించ బోతోంది. దాంపత్య అనుకూల్యతా కోరికలు ఎక్కువగా ఉంది. అలాగే వ్యయం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అష్టమ స్థానాధిపతి ఐనటువంటి కుజుడు ద్వితీయ మందు ధనాదాయాన్ని సూచిస్తుంది. ఉద్యోగంలో గాని విద్యలో గాని కీర్తిలో మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. చిరాకు ఎక్కువగా ఉంటుంది పిల్లల వల్ల ఆనందం మరికొంచెం పొందుతారు. ఉత్తర వారికి విపత్తార తో ప్రారంభం కావున మంచి ఫలితాలు తక్కువగా ఉంటాయి. హస్తవానికి సంపూర్ణ ఫలితాలు, ఎనభైశాతం అనుకూలం కనిపిస్తోంది. చిత్తవారు ధన విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం: బుధవారా నియమాలు పాటించడం మంచిది. లక్ష్మివారం గురు చరిత్ర లేదా గురు పూజ చేయండి సత్ఫలితాన్ని పొందుతారు .

తులారాశి :

ఈరాశి వారికి లగ్నంలో ఉన్న చంద్ర కుజ బుధులు మేలే చేస్తారు. లాభాస్థానాధిపతి అయిన రవి ద్వితీయ ముందుండి ధనాన్ని కలుగచేస్తాడు. తృతీయ మందున్న ఐదుగురు మీకు మేలే చేస్తారు. అయితే లగ్నాధిపతి అయిన శుక్రుడు గురు శనులతోనే కలయిక వల్ల ఒక చిన్న ఆపద మాత్రం సూచిస్తుంది. అష్టమాధి పతి అయిన శుక్రుడు తృతీయ మందుండడం వల్ల కళత్రం తో వైరము గానీ కించిత్ అనవసర వ్యయంగానీ, ఖరీదైనవి ఎక్కడున్నా పెట్టి మర్చిపోవడం లేదా పోగొట్టుకొనే అవకాశాలు కూడా లేకపోలేదు. మంచి ఆలోచనలతో మంచి పనులు సానుకూల పడే అవకాశం ఉంది.ఎవరైనా మీ వెంట పడితే కొంచెం అవసరాన్ని బట్టి దూరంగా ఉంచండి. మొత్తం మీదైతే మంచి ఫలితాలే ఎక్కువగా పొందుతారు . చిత్త వారికి ధన వ్యయం కనిపిస్తోంది. స్వాతి వారికి కొంచెం అనుకూలత కనిపిస్తున్నా విశాఖ మూడు పాదాలు వారికి చాలా మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

పరిహారం: ఈ రాశ్యాధిపతి శుక్రుడు గనుక అమ్మవారి పూజలు ఎక్కువ చేయించండి చాలా లాభాన్ని పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య పూజ కూడా ఉపయుక్తం.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి లగ్నాధిపతి కుజుడు వ్యయ మందుండడం వల్ల మీ ఆలోచనల కంటే ఇతరుల ఆలోచనలు మీపై ప్రభావాన్ని చూపించి ధన వ్యయానికి దారితీస్తాయి. నిదానించి ఆలోచించి ఫలితాల్ని పొందండి. ద్వితీయ ముందున్న ఐదు గ్రహములు అనుకూలత కలిపించే రోజులు వచ్చాయి. శని ప్రభావం బాగా తగ్గింది. గురుకృప దైవకృప కలిగాయి. అన్ని కూడా మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాసాలు ఉన్నాయి. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. కళల పట్ల అభిరుచి అభినివేశం బయటపడతాయి. మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దూరప్రయాణాలు చేస్తారు ధన వ్యయ మైనా సరే ఒక ఆనందము తృప్తి మిగులుతాయి. మీ ఇంట్లో అందరిక కూడా ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయి అయితే వ్యయమందు ఉన్న చంద్రుడు మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది పెడతాడు. 12 వ ఇంట్లో కుజ బుధులున్నా పర్వాలేదు. అనురాధ వారికి నైధనతారయింది. గాన ఫలితాలు చాలా తక్కువగా వున్నాయి. విశాఖ వారికి పర్వాలేదు. జ్యేష్ట వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మీరంటే మరి కొంచెం గౌరవం పెరుగుతుంది.

పరిహారం: సోమవారం రుద్రాభిషేకం చేయించండి సూర్యనమస్కారాలు చేయండి దధి చంద్ర దానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అరుణ వస్త్ర ధారణ కూడా మంచి ఫలితాన్నిస్తుంది.

ధనూ రాశి:

ఈ రాశివారికి శుభ పరంపరలు ఎక్కువేనని చెప్పాలి. వీరికి కించిత్ కాలసర్ప యోగం ఉన్నా గురు శుక్రుల కలయిక ఇంట్లో మార్పుకు కారకుడైన కేతువు ద్వితీయ ధనాధిపతి శని ఇదే రాశిలో ఉండడం వల్ల పనులు సుఫలం అవుతాయి. రవి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిస్తున్నట్లు ఉంది. లాభంలో ఉన్న గ్రహాలు వారికి మేలు చేయనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఆడింది ఆట పాడింది పాట అనవచ్చు.అయినా రాహు ప్రభావం చేత కొద్దిగా మాటకటుత్వం ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. ఇది మీ భవిష్యత్ ప్రణాళికలకు ఉపకరించే అవకాశం ఎక్కువగా ఉంది.శని ద్వితీయ స్థానానికి వెళుతున్నాడు కనుక కొంత వ్యయాన్ని కలిగించి పోతున్నాడు జాగ్రత్త వహించండి. మూల వారికి ప్రత్యక్ తారతో ప్రారంభం. అనుకూలత తక్కువగా ఉంది. పూర్వాషాఢ వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఉద్యోగాలు అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి విపత్తార గాన శుభ ఫలితాలు తక్కువ.

పరిహారం: మీరు గురువారం నియమాలు పాటించండి . కొమ్ము శెనగలు నాన వేసి బెల్లం కొమ్ము శెనగలు ఆవుకి తినిపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం నాడు ఉపవాసం ఉండండి. జపం గాని మన్యు సూక్త పారాయని గానీ మంచిది .

మకర రాశి:

ఈ రాశివారికి రాజ్య లాభాదులు బాగున్నాయి. స్థిరాస్తులు లేదా వ్యాపార లాభాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి మీరు ముందుగా గ్రహించడం చాలా అవసరం. ఒక ప్రక్క ఏలినాటిశని ప్రభావము సప్తమ స్థాన అధిపతి చంద్రుడు వ్యయానికి వచ్చినప్పుడు మానసిక దుర్భలత్వం మీలో చోటుచేసుకుంటుంది. మీపై అన్ని ఒత్తిడులు ఒకేసారి పడిపోతాయి.అప్పుల బాధ లేదా అధికారుల బాధ తప్పనిసరిగా మీకు వేధిస్తుంది. దీన్నించి బయటపడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి మీకు సహకరించడానికి మీ సోదరులు ఉన్నారు. దైవం బలము గురుబలమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఎన్ని చేసినా ఓ ప్రక్క మీ అనుమానాలు,మీ అజాగ్రత్తలు, మీ మందగతి, బుద్ధిమాంద్యం అన్ని కూడా మిమ్మల్ని ఒకేసారి ఇబ్బందిపెడతాయి. దీనివల్ల ఉద్యోగానికి వ్యాపారానికే కాదు మీ అభివృద్ధి కూడా కష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత జాగ్రత్త పడవలసిన సమయంగా మీరు భావించవచ్చు కాలసర్ప యోగం మీకు పూర్తిగా వర్తిస్తుంది. ఉత్తరాషాఢ నాలుగో పాదం వారికి అనుకూలత తక్కువగా ఉంది. శ్రవణం వారికి ఆకస్మిక ధన లాభాదులు కలుగనున్నాయి. ధనిష్ట వారికి ప్రయత్న పూర్వక శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం: సోమవారం రాత్రి తప్పకుండా రుద్రాభిషేకం చేయించండి. శనికి జపం చేయించడం తర్పణ హోమము దానం నువ్వుల దానం చాలా అవసరం.

కుంభ రాశి :

ఈ రాశివారికి అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. ధనాధిపతి లాభంలో ఉన్నాడు, పైగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అందుకే వీరు ఏ పని తలపెట్టినా చక్కగా అయిపోతుంది. రాజకీయ పలుకుబడి లేదా ఒక అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. సోదరీ సోదరులతో గొడవలు ఎక్కువగా ఉన్నా కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. మీకు భవిష్యత్తు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. 7 వ ఇల్లు కుటుంబ వ్యవస్థ కూడా చాలా బావుంది. చిన్నచిన్న పొరపాట్లు పొరపొచ్చాలు భార్యాభర్తల మధ్య వచ్చినా వాటంతట అవే సర్దుకుపోతాయి. మీ మాటకారి తనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు మీరే ఆలోచిస్తూ మంచినిర్ణయం తీసుకోవడం ఒక్కటే మీరు చేయవలసిన పని. మీ బాధ్యత ఇంకొకరి మీద పెట్టకండి. ఉద్యోగోన్నతి వ్యాపారంలో పన్నులను పొందబోతున్నారు మీకు వివాహం జరగాల్సి ఉంటే సానుకూలమైన భార్య లభించే అవకాశం కూడా ఉంది. జీవితంలో స్థిరపడే ఉద్యోగం గాని వ్యాపారంగానీ లభిస్తుంది. శతభిషం పూర్వాభాద్ర నక్షత్రాలు వారు చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ధనిష్ట వారు ప్రయత్నపూర్వకంగా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది.

పరిహారం: శనికి జప దానాదులు చేయించండి, వీలైతే హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. శివస్తోత్రం ఏదైనా పారాయణ చేయండి మంచి పరిచయం కలుగుతుంది.

మీనరాశి:

ఈ రాశివారికి లగ్నాధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉంటూ తన ఇంటిని చూడ్డం వల్ల మంచి జరగబోతోంది. తల్లిదండ్రుల ఆస్తులు, పెంచుకున్న వారి ఆస్తులు, లేదా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. పాత బాకీలు కూడా వసూలు ఔతాయి. మీరు ఏది తలపెట్టిన లాభాన్ని పొందగలుగుతారు. పరీక్షలు ఉద్యోగాల్లోని ఉన్నత స్థానాలు పొందుతారు. వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. మంచి రోజులు వచ్చాయి. దీనిని వినియోగించుకోవడమే మీరు చేయవలసిన పని. ఏదైనా ఆలోచించి చేస్తేమంచిది. ఒక కంపెనీ పెట్టి దాని బాధ్యతలు మీకు అప్పజెప్పినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందులో కూడా మీకు లాభం తలమునకలుగా వస్తుంది. ఇది జీవితానికి సరిపడే రాచ బాటల్ని వేయబోతున్నది. మీకు శత్రువులుగా పనిచేసిన వాళ్లు కూడా మిత్రులుగా మారుతారు. కానీ ఓ చిన్న దృష్టి వారిపైన పెట్టండి. కొద్దిపాటి శని ప్రభావం లేకపోలేదు. ఆరోగ్యం విషయం జాగ్రత్తగా చూసుకోండి.పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర వారికి చాలా అనుకూలమైన రోజులొచ్చాయి. రేవతి వారికి మాత్రం నైధన తార ఐనందున కొంచెం జాగ్రత్త అవసరం.

పరిహారం: ఎక్కువగా శివాభిషేకం మీకు బాగా పనిచేస్తుంది. దత్తాత్రేయ చరిత్ర దక్షిణామూర్తి స్తోత్రం మీ జ్ఞాపక శక్తిని పెంచుతాయి.

Next Story
Share it