బుల్లితెర నటి శ్వేతా తివారికీ కరోనా పాజిటివ్
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2020 12:36 PM ISTదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో రాజకీయనాయకులతో పాటు సీనితారలు ఉన్నారు. తాజాగా మరో నటికి కూడా ఈ వైరస్ సోకింది. హిందీ సీరియల్ ‘మేరే డాడ్ కీ దుల్హన్’ నటి శ్వేతా తివారీ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తనకు ఈ నెల 16 నుండి కరోనా లక్షణాలు ఉన్నాయని.. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. దాంతో వచ్చేనెల 1వ తేదీ వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ప్రకటించింది. తనను ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. తన కూతురు పాలక్ కూడా భౌతిక దూరాన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తుందని చెప్పింది. అలాగే కొడుకు రేయాన్ష్ తన తండ్రి అభినవ్ శుక్లా దగ్గర ఉన్నట్లు చెప్పింది.
"కరోనాతో ఫైట్ చేసేందుకు ప్రతిరోజూ వేడినీళ్లను గుటగుటా తాగేస్తున్నాను. ఇంకా నా క్వారంటైన్ గడువు అక్టోబర్ 1 వరకు ఉంది. సెప్టెంబర్ 27న మళ్లీ ఓసారి టెస్ట్ చేయించుకుంటాను. కానీ నిజంగానే ఇది కష్ట సమయం. నాకే కాదు. అక్కడ షూటింగ్స్‌కు కూడా ఇబ్బందే. ఈ వైరస్ విలయతాండవం నుంచి ఇంకా ఎప్పుడు బయటపడతామో" అని చెప్పుకొచ్చింది. హిందీలో చాలా సీరియల్స్ చేసింది. దానికంటే ముందు బిగ్‌బాస్ సీజన్ 4తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీజన్ విన్నర్ కూడా ఈమెనే. కాగా.. శ్వేతా తివారీ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.