BREAKING: కాంగ్రెస్‌లో చేరిన షర్మిల.. పార్టీ విలీనం

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీని ఐఎన్‌సీలో విలీనం చేశారు.

By అంజి  Published on  4 Jan 2024 5:47 AM GMT
YSRTP, YS Sharmila, Congress

కాంగ్రెస్‌లో చేరిన షర్మిల.. పార్టీ విలీనం

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీని ఐఎన్‌సీలో విలీనం చేశారు. ఆమె వెంట భర్త అనిల్‌ కుమార్‌ ఉన్నారు. 2021 జులై 8న ప్రారంభమైన వైఎస్‌ఆర్‌టీపీ ప్రస్థానం.. ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయకుండానే ఇవాళ్టితో ముగిసింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం షర్మిలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తుందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అని అన్నారు. తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశానని తెలిపారు. ఇకపై ప్రత్యేకంగా వైఎస్‌ఆర్‌టీపీ ఉండదని చెప్పారు. తన తండ్రి వైఎస్‌ఆర్‌ తన జీవితాంతం కాంగ్రెస్‌ కోసం పని చేశారని, తాను తన తండ్రి బాటలో నడుస్తానని ఆమె తెలిపారు. మణిపూర్‌లో హింస తనకు మింగుడుపడటం లేదన్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే దేశంలో సెక్యులర్‌ పార్టీ అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై షర్మిల స్పష్టతనిచ్చారు. కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదన్నారు. తన నిర్ణయాన్ని గౌరవించి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని అధిష్ఠానం ఆహ్వానం పలికిందని తెలిపారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కల అని చెప్పారు. దానిని నెరవేర్చేందుకు తాను పని చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ తనకు ఇంకా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని షర్మిల తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నారు. ఏపీలోనే కాదు.. అండమాన్‌లో అయినా కాంగ్రెస్‌ కోసం పని చేస్తానన్నారు. పార్టీలోకి తనను గౌరవంగా ఆహ్వానించారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎలా అయితే అధికారం నుంచి కిందకు దించామో.. కేంద్రంలో బీజేపీని కూడా దించుతామన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని షర్మిల చెప్పారు.

Next Story