అత‌డికి బెయిల్ ఇవ్వొద్దు.. హైకోర్టులో వైఎస్ వివేకా భార్య ఇంప్లీడ్ పిటిష‌న్‌

YS Viveka’s wife asks Telangana High Court not to grant bail to accused.మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 3:45 PM GMT
అత‌డికి బెయిల్ ఇవ్వొద్దు.. హైకోర్టులో వైఎస్ వివేకా భార్య ఇంప్లీడ్ పిటిష‌న్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న‌ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. సునీల్‌ యాదవ్‌ బెయిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అతనికి బెయిల్ మంజూరు చేయరాదని ఆమె కోరారు.

వివేకా హ‌త్య కేసులో సునీల్ కీల‌క పాత్ర పోషించాడ‌ని, కేసు విచార‌ణ ద‌శ‌లో ఉండ‌డంతో అత‌డి బెయిల్ ఇస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌డంతో పాటు ఆధారాల‌ను తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని సౌభాగ్యమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సునీల్ యాద‌వ్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను తెలంగాణ హైకోర్టు ఫిబ్ర‌వ‌రి 27కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

వైఎస్ వివేకా హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న ఉమాశంక‌ర్, దేవి రెడ్డి శివ‌శంక‌ర్‌, సునీల్ యాద‌వ్‌లు చంచ‌ల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండ‌గా ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై బ‌య‌ట ఉన్నాడు. మ‌రో నిందితుడు ద‌స్త‌గిరి అఫ్రూవ‌ర్‌గా మారాడు.

Next Story