సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు.. మార్చి 10కి విచారణ వాయిదా

YS Viveka murder case.. CBI produces accused in CBI court. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.

By అంజి  Published on  10 Feb 2023 1:47 PM IST
సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు.. మార్చి 10కి విచారణ వాయిదా

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులు సునీల్ యాదవ్, డీవీరెడ్డి శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను ఇప్పటికే సీబీఐ కోర్టుకు తీసుకురాగా, మరో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. తొలుత ఉమాశంకర్‌రెడ్డి వచ్చే వరకు మిగతా నిందితులను కోర్టులో హాజరుపరచలేదు. విచారణను కాసేపటికి వాయిదా వేసిన సీబీఐ కోర్టు ఉమాశంకర్‌రెడ్డి రాకతో విచారణ ప్రారంభించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో ప్రధాన, అనుబంధ చార్జిషీట్లను సీబీఐ కోర్టు ఇటీవలే స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు SC/01/2023ని కేటాయించింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు నంబర్ కేటాయించి సమన్లు ​​జారీ చేసి ఫిబ్రవరి 10న (ఈరోజు) విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు నిందితులను కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

కేసు బదిలీ నేపథ్యంలో కడప జిల్లా సెషన్స్ కోర్టులో హత్య కేసుకు సంబంధించిన ఫైల్స్, చార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, పత్రాలు అన్నింటినీ ఇప్పటికే సీబీఐ అధికారులు 3 బాక్సుల్లో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు.

Next Story