'కాళేశ్వరం అవినీతిపై స్పందించండి'.. ప్రధానికి వైఎస్ షర్మిల లేఖ
YS Sharmila writes to PM on corruption in Kaleshwaram project. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్‌ఐపి)లో భారీ అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు
By అంజి Published on 11 Nov 2022 1:15 PM GMTకాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్‌ఐపి)లో భారీ అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామగుండం రానున్నారు. ఈ సందర్భంగా, ఈ అవినీతిని ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్‌ఆర్‌టిపి పోస్టర్ ప్రచారం ప్రారంభించింది. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో కెఎల్‌ఐపిలో అవినీతి జరిగిందంటూ పోస్టర్లు వెలిశాయి.
తన పాదయాత్రలో భాగంగా షర్మిల పోస్టర్‌ను విడుదల చేసి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ''ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన సందర్భంగా దేశంలోనే అతిపెద్ద నీటిపారుదల కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆయనకు లేఖ రాసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై చర్య తీసుకోవాలని ఆయనను అభ్యర్థిస్తున్నాను" అని ఆమె షర్మిల అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, కాంట్రాక్టర్‌ల లాభాలు, భారీ అవకతవకలు, కల్తీలు, ద్రవ్యోల్బణం, అక్రమార్జనపై తమ పార్టీ తీవ్రంగా పోరాడుతోందన్నారు. ప్రమాణాలు, నాణ్యత విషయంలో రాజీపడడంతోపాటు కాళేశ్వరంలో భారీ నష్టానికి కారణమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. ''అవినీతి నిర్థారణకు బలమైన ఆధారాలతో సీబీఐ, కాగ్‌లకు ఫిర్యాదులు చేశాం. కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రాజెక్టులో అవినీతిని ఎత్తిచూపుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పెదవి విప్పడం తప్ప మరొకటి లేదు.. తన క్యాబినెట్ సహచరుల మాదిరిగా కేవలం ఆరోపణలతో ఆగిపోకుండా తెలంగాణ ప్రజల, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని ప్రధానికి నా విన్నపం'' అని షర్మిల అన్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలను రూ.40000 కోట్ల నుంచి 1.20 లక్షల కోట్లకు పెంచిన కేసీఆర్ తెలంగాణలోని కరువు భూముల రైతులను వెన్నుపోటు పొడిచారని వైఎస్‌ఆర్‌టీపీ నేత ఆరోపించారు. దీంతో రైతులు కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను గమనించిన తర్వాత భారత ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభిస్తుందని తాము ఆశిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. ఇది నిజంగా జాతీయ కుంభకోణంగా మారిందన్నారు.