తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. గ‌వ‌ర్న‌ర్‌కు ష‌ర్మిల‌ విన‌తి

రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరుతూ ష‌ర్మిల‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 12:50 PM IST
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. గ‌వ‌ర్న‌ర్‌కు ష‌ర్మిల‌ విన‌తి

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయంటూ యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధినేత వై.ఎస్.ష‌ర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరుతూ శ‌నివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

అనంత‌రం ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచారని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆమె అన్నారు. దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తుంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందన్నారు.

కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమై, నిరంకుశ పాలన సాగించడం సిగ్గుచేటన్నారు. గ్రామం నుంచి పట్టణం వరకు రాష్ట్రమంతా రణరంగంగా మారింది. ఇటీవల ఒక రాజకీయ పార్టీకి చెందిన యువ కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన తీరును అత్యంత ఖండనీయం.

నా పాదయాత్ర అంతా ప్రజల పక్షాన నిలబడి మీ దౌర్జన్యాలను బయటపెట్టాను. ప్రతిస్పందనను తట్టుకోలేక, మీ సహోద్యోగులు నాసిరకం, అమానవీయ పద్ధతిలో నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరచుగా నన్ను బెదిరించారు. ప‌ట్ట‌ప‌గ‌లే వీధి కుక్కలు ప‌సిపిల్ల‌ల‌పై దాడులు చేస్తున్న‌ట్లే బీఆర్ఎస్ గూండాలు ప్ర‌తిప‌క్షాల మీద కుక్క‌ల్లా ప‌డి దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ లేదంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్షాల‌కు మాట్లాడే స్వేచ్ఛ లేదు. మ‌హిళ‌ల‌కు గౌర‌వం లేద‌న్నారు.

ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి, దాడుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఈ దుర్మార్గపు పాలనలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు ష‌ర్మిల‌ అన్నారు.

గవర్నర్ ఓపికగా విన్నారని, ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారని షర్మిల అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న తన డిమాండ్‌ను పరిశీలిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.

Next Story