కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి
పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
By - అంజి |
కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి
పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పినపాక మండలం ఏడూళ్లబయ్యారానికి చెందిన ముత్తెబోయిన సందీప్ (25).. రెండు నెలల క్రితం కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. మచ్చిక చేసుకుంటుండగా అది తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క కాలి గోరు సందీప్‌కు గుచ్చుకుంది.
తండ్రికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించిన అతడు.. కుక్క పిల్ల కాలి గోరే కదా గుచ్చుకుందని తన గాయాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఇటీవల అతడిలో రేబీస్ లక్షణాలు కనిపించాయి. వ్యాధి తీవ్రం కావడంతో సందీప్‌ను మణుగూరు, భద్రాచలం ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వ్యాధి ముదిరి సోమవారం నాడు సందీప్ మరణించాడు.
కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్షించడం అసాధ్యమని పేర్కొంటున్నారు. జ్వరం, తలనొప్పి, బలహీనత, అయోమయం, నీటిని చూసి భయపడటం రేబీస్ వ్యాధి లక్షణాలు. కుక్క కొరికిన వెంటనే ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ఆఖరుకు కుక్క గోరు గుచ్చుకున్నా నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయించాలని సూచిస్తున్నారు.