సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు ఏం చెప్పారంటే
Yashoda Doctors says CM KCR does not have any heart related problems.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యశోద
By తోట వంశీ కుమార్ Published on 11 March 2022 3:06 PM IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు వివరించారు. కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించినట్లు వెల్లడించారు.
ఫిజిషీయన్ ఎంవీ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 8 గంటలకు ఫోన్ చేసి నీరసంగా ఉందని చెప్పారు. ఎడమ చేయి లాగుతుందన్నారు. దీంతో నేను, ప్రమోద్ రావు ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నాం. కొన్ని పరీక్షలు చేయాలని.. ఆస్పత్రికి రావాలని సీఎంకు మేం సూచించాం. యాంజియోగ్రామ్ పరీక్షల తర్వాత బ్రెయిన్, స్పైన్‌కు సంబంధించి ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించాం. అదృష్టవశాత్తు కేసీఆర్‌కు ఎలాంటి కార్డియో ప్రాబ్లం లేదు. ఎంఆర్ఐ బ్రెయిన్ రిపోర్టు కూడా నార్మల్‌గానే ఉంది. సర్వైక్వల్ స్పైన్ వల్ల నరంపై ఒత్తిడి పడి చెయ్యి నొప్పి వచ్చింది. వరుసగా పర్యటనలు, ఉపన్యాసాలు చేయడం వల్ల నీరసంగా ఉన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. ఎలాంటి సమస్య లేదు. వైద్య పరీక్షల అనంతరం 3 నుంచి 4 గంటలు అబ్జర్వేషనల్లో ఉంచుతున్నాం. మధ్యాహ్నాం 3 నుంచి 4 గంటల మధ్యలో సీఎంను డిశ్చార్జి చేస్తామన్నారు.
కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి అలసటగా ఉన్నట్లు సీఎం చెప్పారు. ఈరోజు ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్తే ప్రగతి భవన్‌కు వెళ్లి పరిశీలించాం. మా సూచన మేరకు ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించాం. ఎలాంటి బ్లాక్స్ లేవని తేలింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు.