ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో విధివిధానాలు రూపొందించి తొందరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు అధికారులు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట పాలక మండలి నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.